మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. పోలీస్ శాఖను టార్గెట్ గా చేసుకుని రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యవస్థలో లోపాల్ని ఎత్తిచూపిస్తున్నట్టుగా ఉంది. బుధవారం నెల్లూరు జిల్లాలో ఓ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. పోలీసుల తీరుపై విమర్శలు చేసారు. గతంలో పోలిస్తే ఏపీలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందిని.. లోకల్ మాఫియా మాత్రం పేట్రేగి పోతుందని ఆయన అన్నారు. ప్రజలకు గుదిబండలా తయారైన ఈ లోకల్ మాఫియాను నియంత్రించాల్సిన అవసరం పోలీసులపై ఉందని ఆనం వ్యాఖ్యానించారు.

 పలు ప్రాంతాల్లో లోకల్ మాఫియాతో పోలీసులతో కుమ్మక్కైయారంటూ వార్తలు వస్తున్నాయని.. దీంతో ప్రజల్లో పోలీసులపై నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తిందని రామనారాయణ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ కు వస్తే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం, భరోసా ఉండగా.. ఇటీవలి జరిగిన కొన్ని చర్యలు పోలీసుల పై నమ్మకం కోల్పోయేలా ఉందని అన్నారు. లోకల్ మాఫియాను నియంత్రించాల్సిన పోలీసుశాఖ.. వారితో చేతులు కలపడం కరెక్ట్ కాదని రామనారాయణరెడ్డి అన్నారు. పోలీసు శాఖ మాఫియా కలిస్తే రాష్ట్రంలో సామాన్యుడికి భద్రత ఉంటుందా అంటూ రామనారాయణ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు.