నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని ఉమేష్ చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్సు హాలునందు జిల్లాలోని యువజన సంఘాలకు క్రీడాసామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వై. రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. క్రీడలు మనిషికి ఆరోగ్యంతోపాటు ఆనందాన్ని కూడా పెంపొందిస్తాయి. ముఖ్యంగా  గ్రామాల్లో ఉండే యువత  ప్రతిరోజు సాయంత్రం తప్పకుండా ఆటలు ఆడుతూ ఉండడంవల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలియజేశారు. నెల్లూరు నగర ట్రాఫిక్ డిఎస్పి పి. మల్లికార్జునరావు మాట్లాడుతూ.. చదువులో సాధించలేని ఎన్నో ఘనతలను సైతం క్రీడలవల్ల సాధిస్తున్నారు.  అందుకు ఉదాహరణ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, పీవీ సింధు, సానియా మీర్జా..! ఇలా ఎందరో క్రీడల్లో రాణించి భారతప్రభుత్వ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను సైతం పొందారు. క్రీడల్లో రాణించడంవల్ల ఉద్యోగాల్లో కూడా వారికి ప్రాముఖ్యత ఉంటుందని తెలియజేశారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఆకుల మహేందర్రెడ్డి, మోటివేటర్ టి. వెంకటేశ్వర్లు నెహ్రూ యువకేంద్ర సిబ్బంది, జిల్లాలోని యువజన సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.