నెల్లూరు నగరంలో 5 ఫ్లైఓవర్లు నిర్మించడం నా మొదటి ప్రాధాన్యత
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు, డిసెంబర్ 22, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో 5 ఫ్లైఓవర్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం ఫ్లై ఓవర్ల పోరాట కమిటీ తరఫున ప్రతినిధులు ఆయనను కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. 2004 నుంచి నెల్లూరు నగరంలో ఫ్లైఓవర్లు లేని కారణంగా 200 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని దాదాపు 400 మంది వికలాంగులు అయ్యారని వారు ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వారితో మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయమై రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి కేంద్ర
మంత్రి నితిన్ గడ్కరీకి ఒక వినతి పత్రాన్ని ఇచ్చామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో నేషనల్ హైవేస్ ఛైర్మన్ ను కలిసి మాట్లాడతామని తెలిపారు. వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
దీన్ని మొదటి ప్రాధాన్యంగా భావిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరసింహారావు, అబూబకర్, డాక్టర్ సునీల్, ఝాన్సీ, ఆచార్య ఆదిత్య కే శ్రీనివాసులు శిరసాని కోటిరెడ్డి సతీష్ సూర్యనారాయణ శంకర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.