రైతుల్ని కలవర పెడుతున్న ఫెంగల్




వివిధ దశల్లో వరి నారుమళ్లు 

పూత దశలో ఉద్యాన పంటలు

మరో ప్రక్క వాన కోసం ఎదురు చూస్తున్న రైతాంగం

రైతులకు సగం మోదం సగం ఖేదం

రాపూరు మేజర్ న్యూస్ 

బంగాళాఖాతం లో ఏర్పడ్డ ఫెంగళ్ తుఫాన్ వరి రైతులను కలవరపెడుతోంది.ఈ ఏడాది వానల్లేక  మండలంలో చాలా వరకు గ్రామాల్లో సేద్యం మానేసారు.తెలుగు గంగ నీటి పారుదల అవకాశం ఉన్న జోరేపల్లి ,మునగాల వెంకటాపురం, మరి కొన్ని గ్రామాల్లో బోర్ల క్రింద  వరి సాగు చేస్తున్నారు.ఇప్పుడు అందరూ వరి నారుమళ్లు పోసుకొని ఉన్నారు.నారుమళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే రెండు రోజులు ముందు విత్తిన నారుమళ్లు మొలక తీసే దశలో ఉండటంతో రెండు రోజులు నీరు నిల్వ ఉంటే మొలక మురిగి పోయే ప్రమాదం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు.అదే విధంగా మెట్ట ప్రాంతం అయిన రాపూరు నిమ్మ,ప్రత్తి ,మిరప లాంటి పంటలు విరివిగా సాగు చేస్తున్నారు.ఈ వానకి పూత దెబ్బతినే అవకాశం ఉండటంతో రైతుల్లో బెంగ మొదలైంది.మరో ప్రక్క నవంబరు నెల దాటి పోతున్నా 95% చెరువులు ఖాళీగానే ఉన్నాయి.ఈ నెలలోసాధారణ వర్షపాతం 306.9 మిల్లీ మీటర్లు కాగా ఇప్పటి వరకు కేవలం 14 మిల్లీ మీటర్లు మాత్రమే కురవడంతో ఈ తుఫాన్ తో అయినా చెరువులు నిండకపోతాయా అని కొందరు రైతులు ఎదురు చూస్తున్నారు.మొత్తంగా ఫెన్గల్ ఏం చేసి పోతుందో చూడాలి మరి.  తుఫాన్ కి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనీ మేజర్ న్యూస్ మండల వ్యవసాయ అధికారి సోమసుందర్ నీ వివరణ కోరగా రైతులు తమ పొలాల్లో మెరుగు అయిన నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు.వర్షపు నీరు నిలవ వుండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండి నారుమళ్లు చెడిపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సబ్సిడీ లో విత్తనాలు అందించడం చేస్తామన్నారు.