గూడూరులో ముస్లింల భారీ ర్యాలీ...
బేటీ పడావ్...బేటీ బచావ్ కాగితాలకే పరిమితమా...?

గూడూరు, జనవరి 10, (రవికిరణాలు) : దిశ నిందితులకు ఉరిశిక్షను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పెద్ద మశీదు నుండి బయల్దేరి గాంధీ బొమ్మ, బొడ్డుచౌక్, సంగం థియేటర్, హాస్పిటల్ రోడ్డు, ముత్యాలపేట మీదుగా టవర్ క్లాక్ సెంటర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు షేక్ జీలానీ బాష మాట్లాడుతూ పాలకులు బేటీ పడావ్...బేటీ బచావ్ కేవలం కాగితాలకే పరిమితమైందన్నారు. దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. చవటపాలెం దిశ నిందితులపై దిశ చట్టాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు ఏ. కేశవులు మాట్లాడుతూ సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే విధంగా మతిస్థిమితం లేని మహిళను మానవ మృగాలు కిరాతకంగా చెరిచి హతమార్చారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పదించి ఐదుగురిపై దిశ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు జహాంగీర్ మాట్లాడుతూ పర్వీన్ పై హత్యాచారానికి పాల్పడిన వారిని తెలంగాణ లో మాదిరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్
చేశారు. ఎఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు (సీవీఎల్) మాట్లాడుతూ  నిందితులతో వారిని పెంచి పోషిస్తున్న, సమర్ధిస్తున్న రాజకీయ నాయకులపై కూడా దిశ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. జేఏసీ కన్వీనర్ షేక్ అన్వర్ బాష మాట్లాడుతూ  మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారానికి, హత్యకు పాల్పడిన మానవ మృగాలను 24 గంటల వ్యవధిలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం అభినందనీయమన్నారు. ఆ మానవ మృగాలపై దిశ చట్టాన్ని అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గూడూరు మత గురువు సజ్జాద్ మౌలానా మాట్లాడుతూ గూడూరు ముస్లిం
సోదరులకు ఈ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. దిశ కేసుగా నమోదు చేసి 21 రోజుల్లోనే దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. మౌలానా షఫీ మాట్లాడుతూ చవటపాలెం ఘటనలో పోలీసుల సేవలు శ్లాఘనీయమన్నారు. పోలీసువకు యువత తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. యువతను పెడదోవ పట్టించేందుకు ఇంటర్నెట్, సినిమాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయన్నారు. క్షణికావేశంలో క్షమించలేని నేరాలకు పాల్పడుతూ వారి జీవితాలతోపాటు కుటుంబాలను వీధిన పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉంటాయనే గ్యారంటీ
ఇవ్వలేమన్నారు. ఇకనైనా యువత మేల్కొని సమాజ హితం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. జేఏసీ నాయకులు సయ్యద్ నయీం మాట్లాడుతూ కొంతమంది నాయకులు దిశ కేసును తప్పుదోవ పట్టించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలంస్తోందన్నారు. దిశ కేసులో న్యాయం జరిగేంత వరకూ పోరాటం ఆగదన్నారు. చివరిగా మైనారిటీ నాయకులు జీలాని బాష ర్యాలీలో పాల్గొన్న ముస్లీం సోదరులు, సీపీఎం, సీపీఐ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  పఠాన్ అజీజ్ ఖాన్, మైనారిటీ నాయకులు ఇలియాజ్, ముర్తుజ, ఉమర్, ఇబ్రహీం, బుజ్జ, రసూల్, ఫయాజ్, అజీజ్ లతోపాటు 200 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు.