రాజ్యాధికారం చేజిక్కించుకోవడమే కార్మిక వర్గానికి విముక్తి : కుమార్ రెడ్డి

రవి కిరణాలు,సూళ్లూరుపేట మార్చి 30:-

కార్మిక వర్గం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారానే ప్రజలకు విముక్తి లభిస్తుందని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కె కుమార్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి నియోజకవర్గ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు మారుతున్నా కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదన్నారు. కేంద్రంలో  అధికారంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ముకాస్తూ కార్మికుల నడ్డివిరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి అదానీ, అంబానీలు మాత్రమే దేశపౌరులుగా కన్పిస్తున్నారు తప్ప వేరే ఎవరూ కనిపించడం లేదన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోలియం ధరల మూలంగా రవాణా రంగం కుదేలైపోతున్నదన్నారు. మోదీ దేశ సంపదను లూటీ చేసి అదానీకి అప్పగించడమే పాలనగా భ్రమపడుతున్నాడని అన్నారు. కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా కుదించడం ద్వారా మోదీ తనకున్న కార్మికవర్గ వ్యతిరేకతను చాటుకున్నాడని ప్రధాని నిరంకుశ వైఖరిని దుయ్యబట్టారు. కార్మిక వర్గం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి కార్మికలోకం తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, ఎఐటియుసి నియోజకవర్ గౌరవాధ్యక్షులు శ్రీనివాసులు అధ్యక్షకార్యదర్శులు రమణయ్య,నాగేంద్రబాబు నియోజకవర్గ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.