నెల్లూరు, ఫిబ్రవరి 03, (రవికిరణాలు) : అనర్హులుగా ప్రకటిస్తూ ఫిబ్రవరి మాసంలో పెన్షను అందుకోని లబ్ధిదారులు ఆందోళనపడొద్దని, సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులందరికీ పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి ప్రకటించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అనర్హుల జాబితాలోని లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని మరలా సేకరిస్తామని, అర్హులుగా తేలిన వారిని తిరిగి పధకంలో కొనసాగిస్తామని తెలిపారు. పెన్షన్ల పునరుద్ధరణ విషయంలో ఎలాంటి అపోహలకు గురికాకుండా జాగ్రత్తలు వహించాలని, పెన్షన్ పధకం పునరుద్ధరిస్తామనే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరించేలా అన్ని చర్యలూ తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేసారు.