జిల్లా యంత్రాంగం కోవిడ్ - 19 (కరోనా వైరస్) నివారణ చర్యలు పటిష్టంగా చేపట్టినందున జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టరు ఎం.వి.శేషగిరిబాబు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా పరిషత్ ఆవరణలోని జిల్లా ఎమర్జన్సి ఆపరేషన్ సెంటర్ నందు కోవిడ్ - 19 (కరోనా వైరస్) నివారణ చర్యలకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య అధికారులతో జిల్లా కలెక్టరు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ వివిధ దేశాల నుండి 325 మంది విదేశీ ప్రయాణికులు నెల్లూరు జిల్లాకు వచ్చారన్నారు. వారిలో 268 మందిని గుర్తించామని, వారందరిని వారి నివాసాలలోనే హోం ఐసోలేషన్ లో వుంచి ఆశావర్కర్లు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారన్నారు. విదేశాల నుండి నెల్లూరు జిల్లాకు చేరుకున్న వారు జిల్లా వైద్య ఆరోగ్య అధికారులను సంప్రదించి హోం ఐసోలేషన్లో వుండమని చెప్తున్నామన్నారు. కరోనా లక్షణాలు వున్న వారు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. వీరందరిని వారి నివాసాల నుండి బయటికి రాకుండా జనస్రవంతిలో కలవకుండా వుండవలసిందిగా కోరామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఈ వైరస్ నివారణకు అన్ని చర్యలు పక్కాగా చేపట్టిందన్నారు. ప్రజలు ఎవరూ ఈ విషయం గురించి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు డా .వి.వినోద్ కుమార్, ట్రైని కలెక్టరు కుమారి కల్పనా కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారి శ్రీమతి రాజ్యలక్ష్మి, వైద్య ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు.