ధాన్యం సేకరణ, కొనుగోళ్లకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు, మిల్లర్లు ప్రభుత్వ వ్యవస్థ పై అన్నదాతకు నమ్మకం, భరోసా కల్పించేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు సూచించారు.

 శుక్రవారం సాయంత్రం కలెక్టర్ వారి బంగ్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియకు సంబంధించి అధికారులు, మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఉన్న లోటుపాట్లను అధికారులు పరిష్కరించి రైతు ఎటువంటి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి పెండింగ్లో ఉన్న నగదును త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. మిల్లర్లు రైతుకు మానవతా దృక్పథంతో సహకారం అందించాలని, మిల్లు కు వచ్చిన ధాన్యాన్ని సకాలంలో దించుకోవాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే ధాన్యం సేకరణ, ప్రత్యామ్నాయ పంటలపై రైతుకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రైతు ధాన్యాన్ని నేరుగా మిల్లుకు తరలించకుండా రైతు భరోసా కేంద్రం ద్వారానే విక్రయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్ కి రైతుల నుంచి వస్తున్న సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.
 సమావేశానికి ముందుగా జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిరప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ, బిల్లుల చెల్లింపు, ఇంకా సేకరించాల్సిన ధాన్యం తదితర విషయాలను కలెక్టర్కు వివరించారు.
 ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల కార్పొరేషన్ మేనేజర్ శ్రీమతి పద్మ, డి.ఎస్.ఒ శ్రీ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, మార్కెటింగ్ శాఖ ఏడి శ్రీమతి రామమ్మ, జిల్లా కో ఆపరేటివ్ అధికారి శ్రీ తిరుపాల్రెడ్డి, డీసీఎంఎస్ మేనేజర్ శ్రీ వెంకట స్వామి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తాసిల్దార్లు, మిల్లర్లు పాల్గొన్నారు.