శనివారం నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్














సఫాయి కర్మచారీల ( వ్యర్ధాలను తొలగించేవారు ) జీవన స్థితిగతులను మెరుగుపరచడంతోపాటు, వారి ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత నివ్వాలని సఫాయి కర్మచారి జాతీయ కమీషన్ సభ్యులు డాక్టర్ పి పి వావ పేర్కొన్నారు. 


శనివారం నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఇతర జిల్లా అధికారులతో సఫాయి కర్మచారుల అభివృద్ధి కి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సఫాయి కర్మచారి జాతీయ కమీషన్ సభ్యులు డాక్టర్ పి పి వావ సమీక్షించారు.


నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో పలు విభాగాల్లో పనిచేస్తున్న సఫాయి కార్మికులు, వారి సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ వివరించారు.


ఈ సందర్భంగా సఫాయి కర్మచారి జాతీయ కమీషన్ సభ్యులు డాక్టర్ పి పి వావ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పాటుపడే సఫాయి కర్మచారుల ఆర్థిక పురోభివృద్ధికి అందరం కలసి కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో సఫాయి కర్మచారులకు ప్రత్యేక ప్రాధాన్యత నివ్వాలన్నారు. వారి ఆరోగ్య భద్రత కు అత్యంత ప్రాధాన్యతనిచ్చి హెల్త్ కార్డుల మంజూరు, హెల్త్ ఇన్సూరెన్స్ పధకాలు అమలు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య పనులు చేస్తూ  ప్రమాదవశాత్తు మరణిస్తే బాధితులకు పరిహారాన్ని 10 లక్షల నుంచి 30 లక్షల వరకు చెల్లించాలన్నారు. బ్యాంకులు రుణాల మంజూరులో సెక్యూరిటీ కొరకు సఫాయి కర్మచారులను ఒత్తిడి చేయరాదన్నారు. సఫాయి కర్మచారుల అభివృద్ధి కి నెల్లూరు నగరపాలక సంస్థ విశేష కృషి చేస్తున్నదని, ఇందుకుగాను నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.


జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు నెల్లూరు నగరంలో సక్రమంగా అమలు జరుగుతున్నాయని, జిల్లాలోని అన్ని పంచాయతీలలో ఇదే విధమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు.


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేథు మాధవన్, కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి,  ఇన్చార్జి డిఆర్ఓ పద్మావతి,  అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు