నెల్లూరు, మార్చి 16:--  జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాల ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.

బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో " జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి " సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు  సింగిల్ డెస్క్ పోర్టల్ కు 949 దరఖాస్తులు వచ్చాయని, అందులో 905 దరఖాస్తులను ఆమోదించామని,  13 దరఖాస్తులు తిరస్కరించామని, 31 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు.  పెండింగ్లో  ఉన్న వాటిలో 7 గడువు దాటిన దరఖాస్తులు కాగా   అవన్ని అగ్నిమాపక శాఖకు సంబంధించినవన్నారు.  వాటిని వెంటనే విచారించి పరిష్కరించాలన్నారు.   మిగిలిన గడువులోపల ఉన్న 24 దరఖాస్తులను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించి పరిశ్రమలు  నెలకొల్పు టకు మార్గం సుగమం చేయాలన్నారు.  జిల్లాలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 13487 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే 20 పెద్ద పరిశ్రమల యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన భూములను  త్వరితగతిన కేటాయించేందుకోసం తగిన చర్యలు చేపట్టాలన్నారు.  జిల్లా స్థాయి పరిశీలన కమిటీ సిఫారసుల మేరకు  వివిధ పరిశ్రమల నుండి 176 క్లేయిములు రాగా పెట్టుబడి రాయితీ, భూమి ధర తిరిగి చెల్లింపు,   స్టాంప్ డ్యూటీ, మార్ట్ గేజ్ డ్యూటీ,విద్యుత్ బిల్లులు, అమ్మకం పన్ను తిరిగి చెల్లింపు, వడ్డీ రాయితీ కలుపుకొని 7,63,43,306 రూపాయలు ప్రోత్సాహకాలను మంజూరు చేస్తున్నామన్నారు.  ప్రధానమంత్రి  ఉపాధిహామీ  కార్యక్రమం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిశ్రమల కేంద్రం పరిధిలో  74 యూనిట్లు నెలకొల్పాల్సిఉండగా 113 యూనిట్లు మంజూరు చేశామని,  ఇప్పటికే 3.01  కోట్ల రూపాయల వ్యయంతో 90 యూనిట్లు మొదలు పెట్టామన్నారు. అలాగే ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు  పరిధిలో 42 యూనిట్లు లక్ష్యం కాగా 46 యూనిట్లు మంజూరు చేశామని అందులో ఇప్పటికే  1.52 కోట్ల రూపాయల ఖర్చుతో 33 యూనిట్లు మొదలు పెట్టడం జరిగిందన్నారు. మిగిలిన లక్ష్యాన్ని కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

 ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీ మారుతీ ప్రసాద్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీ చంద్రశేఖర్, జిల్లా రిజిస్ట్రార్ శ్రీ  బాలాంజనేయలు, డి పి ఓ శ్రీమతి ధనలక్ష్మి, ఆర్టిఓ శ్రీమతి సుశీల, జిల్లా  అగ్నిమాపక అధికారి శ్రీ శ్రీకాంత్ రెడ్డి, కర్మాగారాల తనిఖీ అధికారి శ్రీ శివ శంకర్ రెడ్డి, ఏపీ ఎస్ ఎఫ్ సి సహాయ మేనేజర్ శ్రీ కిరణ్, కాలుష్య నియంత్రణ మండలి  ఇ ఇ శ్రీ రాజశేఖర్, పరిశ్రమల కేంద్రం డి డి శ్రీ షఫీ అహ్మద్, ఏ డి శ్రీ శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.