ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి డాక్టర్ ఎం గోవిందయ్య
ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి డాక్టర్ ఎం గోవిందయ్య,
ప్రభుత్వ ఆయుష్ శాఖ మెడికల్ ఆఫీసర్.
మానవ జననం జరిగినప్పటి నుండి ఆయుర్వేదం అందుబాటులో ఉందని, అదేవిధంగా దేవతలకు వైద్యం చేసిన ఘనత మహా ఋషి ధన్వంతరకి దక్కుతుందని, నెల్లూరు ఆయుర్వేదిక్ ఆసుపత్రి ప్రధాన వైద్యుడు డాక్టర్ ఎం. గోవిందయ్య అన్నారు. మంగళవారం, ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా మహా ఋషి భావాతీత ధ్యానయోగ కేంద్రం బాలాజీ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యానికి పితామహుడు ధన్వంతరి అని, ప్రపంచంలో ఏ రోగాన్నైనా రాకుండా నిరోధించే శక్తి కేవలం ఆయుర్వేదికానికి ఉందన్నారు. అదేవిధంగా మానవులకు మానవ అవయాలలో జరిగే మార్పులు చేర్పులకు ఆయుర్వేద వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తరతరాల నుండి వస్తున్న ఆయుర్వేద వైద్యం ద్వారా శస్త్ర చికిత్సలు అవసరం లేకుండా ప్రజలకు వైద్యం అందిస్తున్నామన్నారు. దీర్ఘకాల వ్యాధులను కూడా ఆయుర్వేదం తగ్గిస్తుంది అన్నారు. అడవిలో, గ్రామంలో, పట్టణంలో ఏ ప్రాంతంలోనైనా పేదలకు అందుబాటులో ఉండే గొప్ప వైద్యం ఆయుర్వేదమని ఆయన ప్రశంసించారు. ఆయుర్వేదానికి సంబంధించిన దినుసులు గతంలో ప్రతి ఇంట్లో ఉండేవని నాగరికత పేరున ఆయుర్వేదాన్ని దూరం చేసుకుని లక్షలాది రూపాయలు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టడం విచారకరమన్నారు. అమ్మలాంటి వైద్యం ఆయుర్వేదాన్ని మర్చిపోరాదని, ప్రతి ఒక్కరు దాని విషయాన్ని గుర్తించి చేయూతనివ్వాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదానికి కావలసిన సహాయ సహకారాలు అందించడం అభినందనీయం అన్నారు. ఎలాంటి అనారోగ్యానికైనా తాము వైద్యం చేస్తామని ఆయన పేర్కొన్నారు. పి.హెచ్.పి అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో డా.యం. గోవిందయ్య, డా. వినోద్, నజీర్ భాష గురూజీ, ఏ.జయ ప్రకాష్, యోగా నిర్వాహకులు ముత్యాల రవీంద్రలను ఘనంగా సత్కరించారు. ధన్వంతరి పూజ అనంతరం యాగాన్ని నిర్వహించి, ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పి.హెచ్.పి నాయకులు గోరంట్ల శేషయ్య, చిట్లూరి వీరయ్య, నరసాపురం ప్రసాద్, ఉప్పరపాటి రామదాసు తదితరులు పాల్గొన్నారు.