రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి పి.అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పై జిల్లా అధి కారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఎందుకు వస్తుందని మైనింగ్ అధికారులను ప్రశ్నించారు. అవగాహన లోపంతో యిసుక వాహనాలు సీజ్ చేస్తున్నందున ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. ఈ విషయంలో అధికారులు జాగ్రత్త వహించి యిసుక సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడవలసిందిగా గనులశాఖకు సంబంధించిన అధికారులను ఆదేశించారు. స్థానిక అవసరాలు కాదని, యితర జిల్లాలకు యిసుక ఎలా తరలిపోతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా ఎక్కువ ధరలకు యిసుక విక్రయం ఎందుకు జరుగుతుందని మైనింగ్ అధికారులను వివరణ కోరారు. ధరల లో వ్యత్యాసం ఎందుకు వస్తుందని అధికారులను ప్రశ్నించారు. గ్రావెల్ గురించి మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం వున్న 6 గ్రావెల్ రీలు సరిపోవని, గ్రావెల్ మైనింగ్ కు ఏ ఏ ప్రాంతాలలో అవకాశం వుందో గుర్తించి వాటికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వం తల పెట్టిన 15 వందల కోట్లు రూపాయల అభివృద్ధి పనులు త్వరితగతిని పూర్తి చేయవలసి వున్నందున యిసుక కొరత రాకుండా చూడాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పనులకు యిసుక సరఫరా చేసే వాహనాలను గుర్తించి వాటిని ఆపకుండా తగు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు. జిల్లాలో త్రాగునీటి సమస్య గురించి మంత్రిగారు మాట్లాడుతూ, వేసవి రాబోతున్న దృష్ట్యా త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు, తీసుకొనేలా అప్రమత్తంగా వుండాలన్నారు. సి.ఎస్.ఆర్. ఫండదు త్రాగునీటి అవసరాలకు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మెట్ట ప్రాంతాలలో, త్రాగునీటి సమస్య అధికంగా వుంటుందని, త్రాగునీటి కొరకు ప్రజలు యిబ్బంది పడకుండా ఈ సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు.