డీ విటమిన్‌తో కరోనాకు ఢీ

కాన్‌బెర్రా : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ బారిన పడినప్పటికీ ప్రాణాలతో బయట పడాలంటే ప్రతి రోజు పది నిమిషాలపాటు ఎండలోకి వెళ్లడం ఒక్కటే అత్యుత్తమమైన పరిష్కార మార్గమని ఆస్ట్రేలియాకు చెందిన స్కిన్‌ క్యాన్సర్‌ నిపుణులు డాక్టర్‌ రాచెల్‌ నీల్‌ తెలియజేశారు. తాను పరిశీలించినంత వరకు విటిమిన్‌ డీ తక్కువగా ఉన్నవారిలోనే ఎక్కువగా కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆమె చెప్పారు. డీ విటమిన్‌ ఎక్కువగా ఉన్నట్లయితే వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. రోగ నిరోధక శక్తి ద్వారానే కరోనా వైరస్‌ను ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు.
డీ విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో శ్వాసకోశ ఇబ్బందులు తగ్గిపోవడం తాను గతేడాదే కనుగొన్నానని డాక్టర్‌ రాచెల్‌ తెలిపారు. డీ విటమిన్‌ ఎక్కువగా ఉన్న వారిలో కూడా శ్వాసకోశపరమైన ఇబ్బందులు ఉంటాయని ఆమె తెలిపారు. అయితే డి విటమిన్‌ తక్కువగా ఉన్న 78 వేల మంది రోగులను అధ్యయనం చేశానని, వారిలో డీ విటమిన్‌ ఎక్కువగా ఉన్న వారిలో ఉండే శ్వాసకోశ ఇబ్బందులకన్నా డీ విటమిన్‌ తక్కువగా ఉన్నవారిలో రెట్టింపు ఇబ్బందులు కనిపించాయని ఆమె చెప్పారు. వాతావరణ పరిస్థితులనుబట్టి అంటే, ఎండ తీవ్రతను బట్టి ప్రతి రోజు ఐదు నుంచి 15 నిమిషాలపాటు ఎండలోకి వెళ్లడం మంచిదని ఆమె సూచించారు.