నేటి నుండి రాత్రి 11 నుండి ఉదయం 5 వరకు కర్ఫ్యూ

                                                                         ఆర్.డి.ఓ.హుసేన్ సాహెబ్


కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రతి రోజు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు నెల్లూరు ఆర్.డి.ఓ.హుసేన్ సాహెబ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయములో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ రోజు నుంచే దీనిని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగి పోతుండడంతో, వాటి నివారణ కొరకు ప్రభుత్వం తగు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎవరైనా అత్యవసర వేళల్లో మాస్కులు లేకుండా బయట తిరిగితే  100 రూపాయలు జరిమానా తప్పదన్నారు. కరోనా నియంత్రణ చర్యలో మాస్కు ధరించడం ఒక్కటే కీలకమని,అనవసరంగా బయట తిరగవద్దన్నారు. అత్యవసర వేళల్లో తిరిగితే ఖచ్చితంగా మాస్కును ధరించాలన్నారు. షాపింగ్ మాల్స్ నిర్వాహకులు, దుకాణా దారులు ఎవరైనా సరే మాస్కులు లేకుండా కొనుగోలుదారులకు అనుమతినిస్తే 10 వేల జరిమానాలను విధించడం జరుగుతోందన్నారు. కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సంబంధిత అధికార సిబ్బంది కూడా పూర్తిస్ధాయిలో నిబంధలను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.