చెత్త సేకరణ వాహనాలకే వ్యర్ధాలు అందించండి - కమిషనర్ వికాస్ మర్మత్  ఐ. ఏ. యస్.

క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణకు ప్రజలంతా సహకరించి, సేకరణ వాహనాలకు గృహ వ్యర్ధాలను అందించాలని కమిషనర్ వికాస్ మర్మత్ కోరారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శోధన్ నగర్ మస్టర్ పాయింట్ ను కమిషనర్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది హాజరును పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్టు, రామలింగాపురం ప్రధాన మార్గం, మాగుంట లే అవుట్ లెక్చరర్స్ కాలనీ, ముత్యాల పాలెం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న చెత్త సేకరణ పనులను కమిషనర్ పర్యవేక్షించారు. స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ తడి,పొడి చెత్తను విడివిడిగా చెత్త సేకరణ వాహనాలకు అందించాలని సూచించారు. చెత్తను రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా సేంద్రీయ ఎరువులుగా మార్చి తిరిగి ప్రకృతిలోకి తీసుకురాగలమని కమిషనర్ ప్రజలకు వివరించారు. వాహనాలకు కాకుండా బహిరంగ ప్రదేశాల్లో, డ్రైను కాలువల్లో చెత్తను వేయడం వలన దోమల వ్యాప్తి పెరిగి అనారోగ్యాలు కలుగుతాయని కమిషనర్ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని, అలాంటి వారి సమాచారం అందిస్తే జరిమానాలు విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు.

స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలోని ఏ.సి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్టు ప్రాంగణం పరిసరాల్లో రోడ్డు మార్జిన్ కూరగాయల విక్రయదారులు పరిశుభ్రతను పాటించాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకై ఉదయం 6.30 గంటలకు రోడ్డు మార్జిన్ విక్రయదారులంతా పరిసరాలను ఖాళీ చేయాలని కమిషనర్ సూచించారు.

అనంతరం స్థానిక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును కమిషనర్ పరిశీలించి, నీటి స్వచ్ఛత, సరఫరా తదితర వివరాలను అధికారులను విచారించారు. వేసవి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నిరంతరం తాగునీటి సరఫరా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం అధికారులు, సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు.