నెల్లూరులో మంత్రి కాకని అభినందన సభ
నెల్లూరు, ఏప్రిల్ 17 : రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డికి వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు.
ఆదివారం మధ్యాహ్నం విజయవాడ నుంచి నెల్లూరు బయల్దేరిన మంత్రి కాన్వాయ్ మధ్యాహ్నం నాలుగు గంటలకు కావలికి చేరుకుంది. కావలి పట్టణంలోని పెండెం వారి సెంటర్లో ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నేతలు, అభిమానులు మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలతో మంత్రిని సత్కరించారు. అనంతరం కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లిన కాకాణి అక్కడి కార్యకర్తలు, నేతలతో ముచ్చటించారు.
అనంతరం నెల్లూరుకు బయల్దేరిన మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కాన్వాయ్ సాయంత్రం 5:30 గంటలకు కావలి టోల్ప్లాజాకు చేరుకోగా అక్కడ మంత్రి రాక కోసం మధ్యాహ్నం నుంచి వేచి ఉన్న వైకాపా కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కాకాని భారీ కాన్వాయ్ తో నెల్లూరుకు చేరుకోగా ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఆర్యవైశ్య నాయకులు, వైకాపా కార్యకర్తలు కాకాణి కి అపూర్వ స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రి ఘనంగా నివాళులర్పించారు. అక్కడినుంచి విజయ మహల్ గేట్ సమీపంలోని మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసిన మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి నగరంలోని వైసిపి కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. వైసీపీ కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికి తమ నేతకు శుభాకాంక్షలు తెలిపారు.