రొట్టెల పండుగలో సౌకర్యాలను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్, కమిషనర్
రొట్టెల పండుగలో సౌకర్యాలను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్, కమిషనర్
ప్రసిద్ధిగాంచిన నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులకు అందుతున్న సౌకర్యాలను జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ లు సోమవారం పర్యవేక్షించారు. ఐదు రోజుల పాటు జరగనున్న పండుగకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు దర్గా ప్రాంగణం, రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు తీర ప్రాంతంలో అన్ని వసతులను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
స్వర్ణాల తీరంలో రొట్టెలు మార్చుకునే ప్రాంతమంతా అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య నిర్వహణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. దర్గా ప్రాంగణంలో మంచినీటి కేంద్రాల ద్వారా నిరంతరం సేవలను అందించాలని, మంచినీటి కేంద్రాల సమీపంలో పరిశుభ్రతను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. బారా షహీదుల దర్శనానికి బారికేడ్ల క్యూ లైన్లలో ఉన్న భక్తులకు మంచినీటి వసతి అందించడం, వాతావరణానికి అనుకూలంగా షామియానాల ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్తలు పర్యవేక్షించాలని సూచించారు. దర్గా లోపలి ప్రధాన ప్రాంగణాలు, దర్గాకు వచ్చే రోడ్డు వెంబడి ప్రాంతాలు, పార్కింగ్ స్థలాల వద్ద నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి కేంద్రాలకు నిరంతరం నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంతో పాటు ఇతర హాస్పిటల్స్ స్వచ్చంధంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య శిబిరాల్లో భక్తులకు అవసరమైన మందులు, ప్రథమ చికిత్స, అంబులెన్స్ సౌకర్యం, ఇతర వైద్య సదుపాయాలను అందించేలా అన్ని జాగ్రత్తలు వహించాలని వారు సూచించారు. జనసమ్మర్ధంలో తప్పిపోయిన చిన్నారులు, వృద్ధులు, కుటుంబ సభ్యుల సమాచారాన్ని నిరంతరం కమాండ్ కంట్రోల్ విభాగం ద్వారా ప్రచారం అందించి తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేలా జాగ్రత్తలు వహించాలని, ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర ప్రమాదకర విద్యుత్ ఉపకరణాలు ఉన్న ప్రాంతాలకు భక్తులు రాకుండా పహారాకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని వారు సూచించారు. రొట్టెలు మార్చుకునే స్వర్ణాల తీరం వెంబడి చిన్నారులు నీళ్లలో లోతుగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా పటిష్టమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళా భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, కమిషనర్ లు సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుని రొట్టెల పండుగ నిర్వహణను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.