పి.ఎమ్ విశ్వకర్మ లబ్దిదారుల పూర్తి వివరాలు సేకరించండి - అదనపు కమిషనర్ నందన్
పి.ఎమ్ విశ్వకర్మ లబ్దిదారుల పూర్తి వివరాలు సేకరించండి - అదనపు కమిషనర్ నందన్
నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్):
ప్రధానమంత్రి విశ్వకర్మ యోచన పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పూర్తి వివరాలను సేకరించి ఆన్లైన్ లో పొందుపరచాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ ఆదేశించారు. కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శనివారం కాల్ సెంటర్ నిర్వహణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ యోజన అనేది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కేంద్ర రంగ పథకమని తెలిపారు. హస్త కళాకారులతో పాటు చేతి వృత్తిదారులకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ పధకం ద్వారా సులభతర రుణాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఆధునిక యంత్ర పరికరాలు అందిస్తూనే డిజిటల్ లావాదేవీల కోసం ప్రోత్సాహకాలను అందించనున్నారని వివరించారు. నగర పాలక సంస్థ పరిధిలో అందుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. అందుకు సంబంధించి లబ్ధిదారులను నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు సేకరించాలని అదనపు కమిషనర్ సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.పి.ఆర్.ఓ బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.