దేశవ్యాప్తంగా సీబీఐ 'ఆపరేషన్​ గరుడ'.. 175 మంది అరెస్ట్

దేశంలోని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దృష్టి సారించింది. అక్రమ రవాణాను అరికట్టేందుకు 'ఆపరేషన్‌ గరుడ'ను నిర్వహించింది.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సీబీఐ 'ఆపరేషన్‌ గరుడ' పేరిట దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఎన్సీబీ, ఇంటర్‌పోల్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని పోలీసుల సమన్వయంతో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లపై దాడులు కొనసాగించింది. ఈ సందర్భంగా భారీగా మాదకద్రవ్యాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 127 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 175మంది డ్రగ్స్‌ వ్యాపారులను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు గురువారం వెల్లడించారు.అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలను విచ్ఛిన్నం చేయడంతో పాటు డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఈ వారం ఆరంభం నుంచి కొనసాగిన 'ఆపరేషన్‌ గరుడ'లో భాగంగా ఆయా ఏజెన్సీలు 127 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాయని తెలిపారు.
పంజాబ్, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్ర సహా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్సీబీ అధికారులు, పోలీసులు ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 6,600 మంది అనుమానితులను ట్రాక్‌ చేశారు. ఆ తర్వాత 127 కేసులు నమోదుచేసి పరారీలో ఉన్న ఆరుగురితో పాటు మొత్తం 175మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్‌ ఇతర పదార్థాల అక్రమ రవాణాను ఏజెన్సీలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సీబీఐ, ఎన్సీబీ ఏజెన్సీలు సమాచార మార్పిడి, విశ్లేషణ, కార్యాచరణ సమాచారం కోసం ఆయా రాష్ట్రాల నిఘా సంస్థలు, పోలీసులతో కలిసి పనిచేశాయి.ఈ దాడుల్లో భాగంగా 5కిలోల హెరాయిన్‌, 34కిలోల గంజాయి, 3కిలోల చరస్‌తో పాటు భారీగా ఇతర డ్రగ్స్‌ని సీజ్‌ చేసినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.