బ్యాంకులు రుణాలు ఇవ్వకూడదనే.. ఏపీని శ్రీలంకతో పోలుస్తున్నారు:బుగ్గన
అమరావతి: ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్ష తెదేపా బులిటెన్ ఇవ్వటం శోచనీయమని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆర్థిక అంశాల్లో అనుభవజ్ఞుడైన యనమల ప్రజలకు తప్పుడు సమాచారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ బాగుందని కాగ్ చెప్పిందన్నారు. దేశంలోనే ఆర్థిక నిర్వహణ చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగాన ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఏడాదికి 2.10 శాతం మాత్రమే ద్రవ్యలోటు ఉందని తెలిపారు. ఏపీ ప్రతిష్టను దిగజార్చేలా, బ్యాంకులు రుణాలు ఇవ్వకూడదనే తెదేపా దుష్ప్రచారం చేస్తోందని బుగ్గన మండిపడ్డారు.గత ప్రభుత్వ హయాంలో 19.50శాతం మేర అప్పులు పెరిగితే వైకాపా ప్రభుత్వ హయాంలో 15.5శాతం మాత్రమే అప్పులు పెరిగాయని పేర్కొన్నారు. ప్రతి దానికీ ఏపీని శ్రీలంకతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీబీటీ కింద రూ.1.40లక్షల కోట్లు పేదలకు చేర్చామని స్పష్టం చేశారు. నాన్ డీబీటీ ద్వారా రూ.44వేల కోట్లు లబ్ధిదారులకు చేరిందన్నారు. నెట్ బారోయింగ్ సీలింగ్ విషయంలో రుణ పరిమితిని పెంచుకోడానికే కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఎగుమతులు, పరిశ్రమలు, పథకాలు, పన్నుల వసూళ్లలో గతంతో పోలిస్తే ఏపీ అత్యున్నత స్థానంలో ఉందన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో ఆలస్యమైన మాట వాస్తవమన్న బుగ్గన జీతాల విషయంలో జాప్యం జరగలేదని తెలిపారు.