ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల‌ను ప్ర‌క‌టించింది. ఆత్మ‌కూరులో జూన్‌ 23న పోలింగ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆరుగురు స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ను బీజేపీ నియ‌మించింది. సినీ న‌టి జయప్రద కూడా స్టార్ క్యాంపెయిన‌ర్ల‌లో ఉన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పర్యవేక్షిస్తున్న విష‌యం తెలిసిందే.

 ఇప్పటికే 90 శాతం ఇంటింటికి ప్రచారం పూర్తయింది. ఇంటింటి ప్రచారంలో బీజేపీ నేత‌ సునీల్ దేవధర్ కూడా పాల్గొన్నారు. ఈ నెల 18, 19వ‌ తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరి కూడా పాల్గొంటారు. 19వ తేదీన ప్రచారంలో జయప్రద పాల్గొంటారు. 19, 20వ‌ తేదీల్లో బీజేపీ సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, 19వ తేదీన బీజేపీ నేత‌ కన్నా లక్ష్మీనారాయణ ప్ర‌చారంలో పాల్గొంటారు. ఈ నెల 20వ తేదిన ఎన్నికల ప్రచార కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి ఎల్.మురగన్ హాజ‌ర‌వుతారు.