ఆదాల నివాసంలో జనమే జనం
ఆదాల నివాసంలో
జనమే జనం
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఆయన నివాసం సందడిగా మారింది. రూరల్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల నుంచి స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఒక పరంపరగా తరలి వస్తూనే ఉన్నారు. అభినందనలు తెలపడం, సమస్యలు చెప్పుకోవడం కొనసాగుతూ ఉంది. బుధవారం ఆదాల నివాసంలో ఉదయం నుంచి సందడి చోటు చేసుకుంది. ఒకటో డివిజన్ నుంచి అధిక సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. అంతకుముందే డిసిసి మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి ఆదాల నివాసానికి వచ్చారు. హిజ్రాలు నాలుగో మైలు ప్రాంతం నుంచి వచ్చారు. తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల వారికి హామీనిస్తూ ఎక్కడంటే అక్కడ ఆక్రమణలు చేయవద్దని, అక్కడ ఖాళీ స్థలం ఉంటే తప్పకుండా కేటాయిస్తామని చెప్పారు. అలాగే ఒకటో డివిజన్ నుంచి కార్పొరేటర్ నాగరాజు, గిరిజన నేత రవి ఆధ్వర్యంలో గిరిజనులు, మైనార్టీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పెన్నా వారధి అంచున తరచూ ముంపునకు గురవుతున్నామని తెలిపారు. తమకు అక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని కేటాయించాలని కోరారు. అక్కడ ఉన్న స్థలమేమిటో పరిశీలించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీ ఆదాల హామీ ఇచ్చారు. అంతకుముందు రూరల్ కార్పొరేటర్లతో ఆదాల ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. వారి సమస్యల గురించి చర్చించి పరిష్కారాలు చెప్పారు. బుజబుజ నెల్లూరు నుంచి మాజీ ఎంపీటీసీ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో పలువురు మైనార్టీలు తరలివచ్చారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వానికి మద్దతును తెలిపి సత్కరించి వెళ్లారు. "వి లవ్ యు" అనే స్వచ్ఛంద రక్తదాతల అంతర్జాతీయ సంస్థ సభ్యులు, ఎం కిషోర్ నేతృత్వంలో ఎంపీ ఆదాలను కలిశారు. ఆయనను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.