డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: జిల్లా కలెక్టర్
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: జిల్లా కలెక్టర్
సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా, మార్చి 02( రవి కిరణాలు):-
ఈ నెల 13 న జరగనున్న ఎం.ఎల్.సి. ఎన్నికల పోలింగ్ కు సంబంధించి సూళ్ళురుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ నెల 12 న పి.ఓ. లకు, ఎ.పి.ఓ.లకు పోలింగ్ మెటీరియల్ అందించడం పోలింగ్ అనంతరం బ్యాలట్ బాక్సులను భద్రపరచడం వంటివి జాగ్రత్తగా చేపట్టాలని చిన్నపొరపాటుకు కూడా తావు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె.వెంకటరమణా రెడ్డి సూచించారు.
గురువారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూళ్లూరుపేట డివిజన్ నందు జిల్లా కలెక్టర్ పర్యటించి పోలింగ్ సామాగ్రి పంపిణీ, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరచనున్న స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటును పరిశీలించి పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ వివరిస్తూ నిర్దేశించిన సమయానికి పోలింగ్ సామాగ్రి తీసుకోవడానికి పి.ఓ. లు, ఎ.పి.ఓ. లు, ఓ.పి.ఓ. లు నిర్దేశించిన సమయానికి ఈ నెల 12 న రిసెప్షన్ సెంటర్ అయిన జూనియర్ కళాశాలకు చేరుకోవాల్సి ఉంటుందని ఆ విధంగా మరోమారు ఆర్.డి.ఓ సూచనలు ఇవ్వాలని ఎన్నికల విధులలో గైర్హాజరు కారాదని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ సమయంలో పోలింగ్ కేంద్రాలకు సంబందించిన మార్క్ డ్ ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు వాటి సీరియల్ నంబర్ తో సహా పి.ఓ. లకు అందించే సమయంలో ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. సూళ్ళురుపేట డివిజన్ కు సంబంధించి 11 లొకేషన్లలో పట్టభద్రులకు 16 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయులకు సంబంధించి 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పట్టభద్రుల ఓటర్లు 15,238, ఉపాధ్యాయ ఓటర్లు 893 మంది ఓటు హక్కును వినియోగించుకొనున్నారని అన్నారు. ఈ నెల 13 న పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని అన్నారు. పోలింగ్ నిర్వహణ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతుల ఏర్పాట్లు విద్యుత్, త్రాగు నీరు, బ్యారికేడింగ్ వంటివి పక్కాగా ఉండాలని, ఓటింగ్ సమయంలో ఇతరులకు బ్యాలెట్ కనిపించకుండా ఏర్పాట్లు జరగాలని వెబ్ క్యాస్టింగ్ కెమెరాలు కూడా ఆ విధంగా అమర్చాలని ఇతరులెవరూ 100 మీటర్ల మార్కింగ్ దాటి లోపల రాకుండా చూడాల్సి ఉంటుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ పర్యటనలో సూళ్ళూరుపేట రెవిన్యూ డివిజినల్ అధికారి చంద్రముని రాణాల్, మండల అధికారులు పాల్గొన్నారు.