2028లో మరో చంద్రయాన్ ప్రయోగం :- ఇస్రో చైర్మన్ సోమనాథన్
2028లో మరో చంద్రయాన్ ప్రయోగం :- ఇస్రో చైర్మన్ సోమనాథన్
చంద్రయాన్ 4, 5 డిజైన్లు సిద్ధం.
ఐదేళ్లలో 70 ఉపగ్రహాల ప్రయోగం.
ఈఏడాది డిశంబర్ లో గగన్ యాన్ ప్రయోగం :- ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడి.
రవి కిరణాలు తిరుపతి జిల్లా శ్రీహరికోట (సూళ్లూరుపేట):-
చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తి అయ్యాయని, వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా అనేక ప్రయోగాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో, అక్కడ నుంచి రాళ్లు, మట్టి తీసుకువచ్చే లక్ష్యంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోందన్నారు. అందులో భాగంగా చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 డిజైన్లు పూర్తైనట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ఇవి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయని చెప్పారు. దిల్లీలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు మీడియాకు చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని తెలిపారు. చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఇప్పటికే చంద్రయాన్-3 పూర్తయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో వివిధ శాఖల అవసరాల కోసం తక్కువ ఎత్తులో చేపట్టే నావిక్ రిసోర్స్‌శాట్, కార్టోశాట్ వంటి ప్రయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. శుక్ర గ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు.
డిసెంబర్ లో గగన్‌యాన్ ప్రయోగం.
మరోవైపు, మానవ రహిత గగన్‌యాన్ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబరులో చేపట్టే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి అన్ని విభాగాల రాకెట్లు శ్రీహరి కోటకు ఇప్పటికే చేరుకున్నాయని చెప్పారు. మరోవైపు చంద్రయాన్ 4 మిషన్ 2028లో చేపట్టే అవకాశం ఉన్నట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఇటీవల పునర్వినియోగ వాహక నౌక పుష్పక్‌ను వరుసగా మూడోసారి ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్వహించిన ప్రయోగంలో స్వయంప్రతిపత్తిగల ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు ఇస్రో చీఫ్ ఛైర్మన్ సోమనాథన్ తెలిపారు .