విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే మరో బషీర్బాగ్ ఉద్యమం తప్పదు : సీపీఐ
విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే మరో బషీర్బాగ్ ఉద్యమం తప్పదు : సీపీఐ
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా ఆంధ్ర ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే మరో బషీర్బాగ్ ఉద్యమం తప్పదని, ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మన్నారు పోలూరు సబ్ స్టేషన్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వినియోగదారుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని సర్వీస్ చార్జీలు, ఫిక్స్డ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, విద్యుత్ సుంకం, ఇంధన సర్దుబాటు చార్జీలు వంటి పేర్లతో ప్రజల నుండి వేల కోట్ల రూపాయలు దోచేందుకు సిద్ధపడ్డాయని ఇందుకు ప్రతిగా ప్రత్యామ్నాయ సాంప్రదాయ ఇంధన వనరులు వాడాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మోడీ చెప్తున్న సాంప్రదాయ ఇంధన వనరులు ఇప్పటికే కార్పొరేట్ కబంధహస్తాల్లో చిక్కుకుపోయాయని కార్పొరేట్లకు మేలు చేసే విధంగానే మోడీ వ్యవహరిస్తున్నాడని ఆయన అన్నారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఉదయం ఆరు నుంచి పది గంటలు రాత్రి ఆరు నుంచి పది గంటలు షేక్ హవర్ పేరుతో అధిక మొత్తంలో రెట్టింపు విద్యుత్ ఛార్జీలను విధించేందుకు పాలక పక్షాలు బరితెగించాయని, ప్రజలు వీరికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వారు అన్నారు. మోడీ తానా అంటే జగన్ తందానా అంటున్నారని గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మల్లే స్మార్ట్ మీటర్లను బిగించడం ద్వారా ప్రజల నడ్డి విరిచేందుకు ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కట్టిన విద్యుత్ బిల్లులకు ట్రూ అప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో సుమారు 5983 కోట్లు రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుండి అదనపు వసూళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయని దీనిని తప్పనిసరిగా ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిందేనని వారు పిలుపునిచ్చారు.
ప్రభుత్వాలు ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు నిర్వహించే ప్రజా ఆందోళనలకు ప్రభుత్వాలు తలవంచక తప్పదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సమితి సభ్యులు వినోద్, ప్రభుదాస్,రమణయ్య చెంచమ్మ బాలు వెంకట కృష్ణయ్య లక్ష్మమ్మ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.