ఆంధ్రప్రదేశ్ లో 2024లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ధీమా వ్యక్తం చేసారు. సోమవారం కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీలక్ష్మి తిరుపతమ్మ అమ్మ వారిని దర్శించుకున్న సోమువీర్రాజు దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కుంటుపడిందని ఆయన అన్నారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కు మొదటిసారి సీఎం అయిన చంద్రబాబు, అమరావతిని రాజధానిగా ప్రకటించారని.. ప్రస్తుత సీఎం జగన్ అమరావతిని కాదని విశాఖను రాజధాని చేస్తున్నారంటున్నారని.. ఇద్దరు కలిసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని సోమువీర్రాజు ఆవేదన వ్యక్తం చేసారు.

 ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం దిశ దశ లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతోందని విమర్శించిన సోమువీర్రాజు.. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన సోమువీర్రాజు..అధికారం చేపట్టగానే అమరావతిలో రూ.10 వేల కోట్లతో అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి రావడంతోనే కృష్ణానదిపై ప్రత్యేకమైన వంతెనలు, విజయవాడ నగరం చుట్టూ నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపడతామని సోమువీర్రాజు అన్నారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 7,200 కోట్లు నిధులు ఖర్చు చేశారని ఈసందర్భంగా గుర్తుచేశారు.