శ్రీసిటీని సందర్శించిన బెల్జియం రాయబారి 

-  పారిశ్రామిక ప్రగతిపై ప్రశంస 

రవి కిరణాలు తిరుపతి జిల్లా శ్రీసిటీ, మార్చి 20 :-



భారత్ లోని బెల్జియం రాయబారి డిడియర్ వాండర్‌హాసెల్ట్ బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, ఇక్కడ ప్రపంచశ్రేణి మౌళిక వసతులు, ప్రత్యేకతలు, వేగవంతమైన పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. 

వివిధ రంగాల ప్రపంచ పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి శ్రీసిటీ వ్యాపారానుకూల వాతావరణం, వేగవంతమైన వృద్ధి ప్రధాన కారణాలుగా డాక్టర్ సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. బెల్జియంకు చెందిన వెర్మీరెన్‌తో సహా 29 దేశాల నుండి 220కి పైగా ప్రముఖ కంపెనీలకు నిలయంగా, భారతదేశంలో ప్రముఖ తయారీ కేంద్రంగా శ్రీసిటీ స్థానం దక్కించుకుందని పేర్కొన్నారు.

శ్రీసిటీ ప్రగతి, మౌళిక సదుపాయాలు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వాండర్‌హాసెల్ట్, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీసిటీ వ్యాపారానుకూల పర్యావరణ వ్యవస్థ చాలా బాగుందని కితాబిచ్చారు. చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు సైతం ఇది అనువుగా ఉంటుందన్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే మరిన్ని బెల్జియన్ కంపెనీలకు తాను శ్రీసిటీని పరిచయం చేస్తానని చెప్పారు. 

దీనిపై స్పందించిన డాక్టర్ సన్నారెడ్డి, గణనీయమైన సంఖ్యలో బెల్జియం సంస్థలు ఆసక్తి చూపితే, ప్రత్యేక బెల్జియం పారిశ్రామిక క్లస్టర్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

పర్యటనలో భాగంగా శ్రీసిటీలోని బెల్జియన్ కు చెందిన వైద్య పరికరాల తయారీ పరిశ్రమ వెర్మీరెన్ ఇండియా రిహాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను వాండర్‌హాసెల్ట్  సందర్శించారు. వెర్మీరెన్ గ్రూప్ చైర్మన్ & సీఈఓ పాట్రిక్ వెర్మీరెన్, మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ రియాజ్ ఖాద్రీ ఆయనకు స్వాగతం పలికి, కంపెనీ ఉత్పత్తులు, వృద్ధి గురించి వివరించారు. అనంతరం, వెర్మీరెన్ ప్లాంట్ నాల్గవ దశ విస్తరణకు అంబాసిడర్ వాండర్‌హాసెల్ట్ లాంఛనంగా శంకుస్థాపన చేశారు. 

శ్రీసిటీ ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా బెల్జియం, భారతదేశం మధ్య సహకారాన్ని, ఆర్థిక వృద్ధిని పెంపొందించడం ఈ పర్యటన ఉద్ద్యేశ్యం కాగా, రాయబారితో పాటు బెల్జియంలోని ఫ్లాండర్స్ రీజియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమీషనర్ జయంత్ నడిగర్ కూడా పాల్గొన్నారు.