పూణే మెట్రో ప్రాజెక్ట్-3 కు అల్‌స్టోమ్ మెట్రో రైళ్లు
- శ్రీసిటీ ప్లాంట్ లో లాంఛనంగా ఉత్పత్తి ప్రారంభం

రవి కిరణాలు న్యూస్ తడ శ్రీసిటీ, మార్చి 04, 2023:


ప్రయాణ సాధనాల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న శ్రీసిటీలోని ఆల్‌స్టోమ్ ట్రాన్స్‌పోర్ట్ ఇండియా  లిమిటెడ్, పూణే మెట్రో ప్రాజెక్ట్-3 కోసం మెట్రో రైళ్లు ను సరఫరా చేసేందుకు ఆర్డర్ పొందింది.  దీనికోసం శుక్రవారం శ్రీసిటీ ఫాక్టరీలో లాంచనంగా ఉత్పత్తి ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పుణేలో బాలేవాడి మీదగా రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్‌ను శివాజీనగర్ కు కలుపుతుంది. త్వరలో ఆల్‌స్టోమ్ ‘మేడ్ @ శ్రీ సిటీ’ మెట్రో రైళ్ళు ఈ మార్గంలో పరుగులు తీస్తాయి. 23 స్టేషన్లతో కూడిన 23.3 కి.మీ ఈ కారిడార్, కొత్త మెట్రో రైల్ పాలసీ ప్రకారం భారతదేశంలో మొట్ట మొదటి మెట్రో ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కోసం 3 పెట్టెలతో కూడిన 66 మెట్రో రైళ్లను ఆల్‌స్టోమ్ తయారు చేస్తుంది. ఇప్పటికే పుణేలో 1&2 ప్రాజెక్ట్ లలో భాగంగా మెట్రో రైళ్లు, ఇతర యంత్ర పరికరాలు సరఫరా చేసిన ఆల్స్టాం కు, పూణే నగరంలో ఇది 3వ ప్రాజెక్ట్.

ఈ ప్రాజెక్ట్ డెవలపర్ అయిన పూణే సిటీ మెట్రో రైల్ లిమిటెడ్ (పిఐటిసిఎంఆర్ఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  అలోక్ కపూర్ లాంఛనంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, శ్రీసిటీలో మెట్రో రైళ్ల ఉత్పత్తిని ప్రారంభించారు. పూణే మెట్రో లైన్ 3 ప్రాజెక్ట్  ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు ఆదర్శవంతమైన  ఉదాహరణ అని, ప్రధాని  నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ విధానాన్ని ఇది బలోపేతం చేస్తుందనడంలో మాకు ఎలాంటి సందేహం లేదని అన్నారు. పిఐటిసిఎంఆర్ఎల్ డైరెక్టర్ నేహా పండిట్, పిఐటిసిఎంఆర్ఎల్ బిజినెస్ సిస్టమ్స్ హెడ్ ఎల్.ఎన్.ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్  అనిల్ కుమార్ సైనీ, ఆల్‌స్టోమ్ ట్రాన్స్‌పోర్ట్ ఇండియా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరో మైలురాయిని దాటినందుకు ఆల్‌స్టోమ్ బృందానికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలుపుతూ, పూణే ప్రాజెక్ట్ 'మేడ్ ఎట్ శ్రీసిటీ' రైళ్లు త్వరలో అందుబాటులోకి రానుండడం  ఆల్‌స్టోమ్ మరియు శ్రీసిటీకి సంతోషకరమైన సందర్భం అని అన్నారు.

కాగా,  దేశంలోని వివిధ మెట్రో ప్రాజెక్టులకే కాకుండా విదేశాల్లోని ప్రాజెక్టులకు కూడా ఆల్స్టామ్ ప్రధాన చిరునామాగా మారింది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 480 రైళ్లను కలిగివుంది. చెన్నై (ఫేజ్ 1&2 మరియు విస్తరణ ప్రాజెక్ట్), కొచ్చి, లక్నో, ముంబై వంటి దేశీయ మెట్రో ప్రాజెక్టులతో పాటు ఆస్ట్రేలియా, కెనడాలకు ఇక్కడి మెట్రో రైళ్ల సరఫరా జరిగాయి.