ఎపిఈసెట్ 2023 కౌన్సిలింగ్ షేడ్యూలు విడుదల చేసిన కన్వీనర్ నాగరాణి

14 నుండి 17 వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు

17 నుండి 20 వరకు ధృవీకరణ పత్రాల పరీశీలన

19 నుండి 21 వరకు ఆఫ్షన్ల ఎంపిక, 22వ తేదీ ఆప్షన్ల మార్సు

25న సీట్ల కేటాయింపు, ఆగస్టు 1న తరగతులు ప్రారంభం 

విజయవాడ: రెండో సంవత్సరం ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈసెట్ 2023 కౌన్సిలింగ్ షేడ్యూలును ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి శుక్రవారం విడుదల చేసారు. జులై పదవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ప్రధాన దిన పత్రికలలో పదకొండవ తేదీన ప్రకటన ప్రచురితం అవుతుంది. ఈసెట్ 2023లో అర్హత సాధించిన విద్యార్ధులకు ఎపి ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ , ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు కోసం జులై 14 నుండి 17వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అవకాశం ఉంటుంది. దృవీకరణ పత్రాల వెరిఫికేషన్ కోసం జులై 17 నుండి 20వ తేదీ వరకు నిర్దేశించారు. విద్యార్ధులు ఆప్షన్ల ఎంపిక కోసం 19 నుండి 21 వరకు మూడు రోజులు కేటాయించారు. ఆప్షన్ల మార్పు కోసం 22వ తేదీని సూచించగా, జులై 25వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామని నాగరాణి వివరించారు. 

ధృవీకరణ పత్రాల నిర్ధారణ, కౌన్సిలింగ్ ప్రక్రియ తదితర అంశాల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 14 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసామని కన్వీనర్ తెలిపారు. ఆన్ లైన్ లో ఏపి ఈసెట్ కౌన్సిలింగ్ కు నమౌదైన విద్యార్ధులకు సహాయ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు.  ధృవీకరణ పత్రాల నిర్ధారణ కోసం విద్యార్ధులు ఎపి ఈసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్ట్ , పదవతరగతి ఉత్తీర్ణత పత్రం, డిప్లమో మార్కుల జాబితా, ప్రోవిజినల్ సర్జిఫికెట్, ఏడవ తరగతి నుండి డిప్లమో వరకు స్టడీ సర్టిఫికేట్, టిసి, ట్యూషన్ ఫీజు రిఎంబర్స్ మెంట్ కోరుకునే అభ్యర్ధులు 2020 జనవరి ఒకటవ తేదీ తరువాత జారీ చేసిన అదాయ దృవీకరణ పత్రం, వివిధ రిజర్వేషన్లకు అవసరమైన ధృవీకరణ పత్రాలు , లోకల్ స్టేటస్ కోసం రెసిడెన్షియల్ సర్జిఫికెట్, ఈడబ్ల్యుఎస్ దృవీకరణ తదితర పత్రాలు సిద్దం చేసుకోవాలన్నారు. 

ఈ సంవత్సరం ఈసెట్ కోసం 38,181 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 34,503 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 92.55 శాతంతో 31,933 మంది అర్హత సాధించారు. నిబంధనల ప్రకారం క్రీడలు, వికలాంగులు, సాయిధ దళాల ఉద్యోగుల పిల్లలు, ఎన్ సిసి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని ఈసెట్ కన్వీనర్ , సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేసారు. సీట్లు పొందిన విద్యార్ధులు జులై 25 నుండి 30వ తేదీ వరకు ఐదు రోజులలోపు అయా కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్జు చేయాలని తరగతులు ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని వివరించారు. మరింత సమాచారం కోసం మంగళగిరి, సాంకేతిక విద్యాశాఖ కార్యాలయం ఆవరణలోని ఎపి ఈసెట్ కన్వీనర్ కార్యాలయాన్ని సందర్శించవచ్చన్నారు. 7995681678, 7995865456, 9177927677 ఫోన్ నెంబర్ల ద్వారా సహాయ కేంద్రాల అధికారులతో కార్యాలయ పనివేళలలో సంప్రదించవచ్చని నాగరాణి పేర్కొన్నారు.