రేపటి నుంచి ఏపీ టూరిజం బోటు షికారు పున:ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీ టూరిజం) ఆధ్వర్యంలో నెల్లూరులోని దర్గామిట్ట స్వర్ణాల చెరువులో రేపటి నుంచి అనగా గురువారం(05-03-2020) నుంచి బోటు షికారును పున:ప్రారంభిస్తున్నట్లు ఆ శాఖ నెల్లూరు డివిజనల్ మేనేజర్ బాబ్జీ బుధవారం తెలిపారు. కొంతకాలంగా బోటు షికారు నిలిపివేసిన నేపథ్యంలో అన్ని అనుమతులు పొందడంతో పాటు బోట్లను ఆధునికీరించి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. మరికొన్ని బోట్లను నెల్లూరు వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే అవి కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ఫంక్షన్లు, పార్టీలకు కూడా బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. బోటు షికారు యూనిట్ ఆవరణలోని ఎకో పార్కులో కూడా ఫంక్షన్లు, పార్టీలు నిర్వహించుకోవచ్చన్నారు. యూనిట్ ఆవరణలోని కాఫీ క్యాంటీన్ ను కూడా ఇకపై తమ సంస్థ నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. బారా షహీద్ దర్గాకు వచ్చే యాత్రికులతో పాటు జిల్లా వాసులందరూ ఏపీ టూరిజం నెల్లూరు బోటింగ్ యూనిట్ సేవలను సద్వినియోగం చేసుకుని ఆహ్లాదాన్ని ఆస్వాదించాలని ఆయన కోరారు.