నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు
గూడూరు శాసనసభ్యులు శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబును కలిసి వారి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ యంత్రాలు సరిగా పనిచేయడం లేదని వాటిని బాగు చేయించాలని కలెక్టర్ను కోరారు. చిల్లకూరు మండలం లోని వైయస్సార్ కాలనీలో గత 25 సంవత్సరాలుగా ఉన్న కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు త్వరగా ఇవ్వాలని, కోట మండలం లోని వెంకన్నపాలెంలో గర్భ కండ్రిక వెయ్యి ఎకరాలు ఉందని దాన్ని అమ్మడానికి గాని కొనుగోలు చేయడానికి గాని వీలు లేక పది సంవత్సరాలుగా నిషేధం ఉందని ఆ నిషేధాన్ని తొలగించాలని ఎమ్మెల్యే కలెక్టర్ను కోరారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సంయుక్త కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్, అభివృద్ధి సంయుక్త కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, గృహనిర్మాణం సంయుక్త కలెక్టర్ శ్రీవిదేహ్ ఖరే, డి ఆర్ ఓ శ్రీ చిన్న ఓబులేసు తదితర అధికారులు పాల్గొన్నారు.