ఆత్మకూరుకు కోటితో  20 వాటర్ ప్లాంట్లు




 ఆత్మకూరు నియోజకవర్గంలో కోటి రూపాయలతో 20 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన మర్రిపాడు లో సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి గౌతమ్ రెడ్డి తో పాటు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈ సారి  వచ్చే తన ఎంపీ నిధుల్లో ఈ వాటర్ ప్లాంట్లకు మిగులు పనులు ఏమైనా ఉంటే కూడా పూర్తి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి చాలా చక్కగా నిర్వహించారని ప్రశంసించారు. మంత్రి ప్రతి సమస్యను వివరంగా తెలుసుకుని పరిష్కారాలకు ఆదేశాలు ఇచ్చారని కితాబునిచ్చారు. రాష్ట్రం విడిపోయాక ఆర్థిక పరిస్థితి దిగజారిందని,  దాంతోపాటు కరోన బాగా దెబ్బతీసిందని, అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆపలేదని ప్రశంసించారు. ఇది దేశ చరిత్రలో ఒక రికార్డు అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం మరొక మంచి కార్యక్రమం అని పేర్కొన్నారు. దీనికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి జేసి  హరెందిర ప్రసాద్, ఎంపీపీ లక్ష్మీదేవి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య ,పాముల హరి, నరసింహారావు, మధు, రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గౌతమ్ రెడ్డి కూడా మాట్లాడారు.