నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వివిధ డివిజన్లలో"స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్"కార్యక్రమాలు





నెల్లూరు కార్పొరేషన్(మేజర్ న్యూస్):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడవ శనివారాన్ని "స్వచ్ఛ ఆంధ్రా స్వచ్ఛ దివస్" గా ప్రకటించి పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన పెంచే విధంగా రూపొందించిన కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా శనివారం నాడు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో సచివాలయ వార్డు శానిటేషన్ కార్యదర్శుల నేతృత్వంలో అన్ని పాఠశాలల విద్యార్థులతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలను నిర్వహించారు.వివిధ ప్రాంతాలలో గత కొన్నేళ్లుగా గార్బేజ్ పాయింట్లుగా వాడుతున్న ప్రదేశాలను నీళ్లతో శుభ్రం చేసి రంగవల్లులతో అలంకరించారు. పూల మొక్కల కుండీలను ఏర్పాటు చేసి "స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్" ప్రతిజ్ఞను విద్యార్థులు, స్థానిక ప్రజలతో చేయించారు. వ్యర్ధాలను బహిరంగ ప్రదేశాలలో వేయరాదని స్థానిక ప్రజలకు విద్యార్థులు అవగాహన కల్పించారు. నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి అందజేసిన చెత్తబుట్టల ద్వారా తడి, పొడి, హానికరమైన వ్యర్ధాలను విడివిడిగా అందించి పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలంతా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.