కాకాణి, కలెక్టర్, గురుమూర్తి కలిసి ప్రారంభించిన "కిసాన్ క్రాఫ్ట్" పరిశ్రమ






శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో నిర్మించిన వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ "కిసాన్ క్రాఫ్ట్" పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారు, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారితో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

 కిసాన్ క్రాఫ్ట్ పరిశ్రమను బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవీంద్ర అగర్వాల్ గారు 50 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్ల రూపాయలు వెచ్చించి, నిర్మించారు. వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ కిసాన్ క్రాఫ్ట్ పరిశ్రమ ద్వారా వ్యవసాయానికి వినియోగించే పరికరాలు ప్రధానంగా ఇంటర్ కల్టివేటర్లు, నీటి పంపులు, ఇంజన్లు తయారు చేస్తారు. పొదలకూరు ప్రాంతం, మెట్ట ప్రాంతంగా ఉన్నప్పుడు కేవలం మెట్ట పంటలైన మినుము, వరి, జొన్న, సజ్జ, రాగులు లాంటి పంటలే జీవనాధారం. రైతులకు మెట్ట మరియు ఆరుతడి పంటల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఆర్జించేందుకు స్వర్గీయ ఏ.సి.సుబ్బారెడ్డి గారి హయాంలో మా తండ్రి కాకాణి రమణారెడ్డి గారు చిరుధాన్యాల పరిశోధనా కేంద్రాన్ని పొదలకూరులో ఏర్పాటు చేశారు. మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు కండలేరు ఎడమ కాలువ నిర్మించడంతో మెట్ట భూములన్నీ మాగాణి భూములుగా మారి, పొదలకూరు ప్రాంత రైతాంగం అదనంగా 22 వేల ఎకరాల్లో వరి సాగు చేసుకునే అవకాశం కలిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచి, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నారు. "వై.యస్.ఆర్.రైతు భరోసా" ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎరువుల కొరత ఉన్నా, రైతులకు ఎరువుల కొరత రానివ్వకుండా చర్యలు చేపడుతున్నాం. ఎరువుల కొరత సమస్యను పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారి దృష్టికి తీసుకొని వెళ్లి, రైతులకు అవసరమైన ఎరువులు అందించేందుకు సహకరించమని కోరగానే ఆయన సానుకూలంగా స్పందించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందవలసిన పనిలేకుండా అవసరమైన ఎరువులన్నింటినీ సరఫరా చేస్తాం. కిసాన్ క్రాఫ్ట్ సంస్థలో 185 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, అందులో 150 మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కాయి. కిసాన్ క్రాఫ్ట్ యాజమాన్యం స్థానికులకు 80 శాతం పైచిలుకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తా. జిల్లాలోని సమస్యలన్నింటినీ చక్కటి అవగాహనతో పరిష్కరిస్తూ, జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తున్న కలెక్టర్ గా చక్రధర్ బాబు గారు గుర్తింపు పొందారు. తిరుపతి పార్లమెంటు సభ్యులుగా అనతికాలంలోనే ప్రజలతో మమేకమై, వారి సమస్యలు సావధానంగా విని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వెళ్లి, పరిష్కరించే ప్రయత్నం చేసే గురుమూర్తి గారి లాంటి వ్యక్తి దొరకడం మన అదృష్టం. కోవిడ్ సంక్షోభంలో కిసాన్ క్రాఫ్ట్ యాజమాన్యం ప్రత్యేకంగా మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర అగర్వాల్ గారు ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివి. కిసాన్ క్రాఫ్ట్ సంస్థ నూతనంగా ప్రారంభించిన సందర్భంగా సంస్థ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.