రెవెన్యూ సమస్యలను తక్షణం పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ఆనంద్
రెవెన్యూ సమస్యలను తక్షణం పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ఆనంద్
నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 10 :
క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులకు తలెత్తుతున్న రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, డిఆర్వో ఉదయభాస్కర్‌రావు, ఆర్డీవోలతో కలిసి రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న రెవెన్యూ సమస్యలపై కూలంకషంగా చర్చించారు. పలు పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపు, ప్రైవేటు పట్టా భూములను నిషేధిత 22ఎ నుంచి తొలగించుట, రీసర్వే సమస్యలు, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్దీకరణ, వెబ్‌ల్యాండ్‌లో ఎదువుతున్న సాంకేతిక సమస్యలు, అసైన్మెంటు భూముల కేటాయింపు, మ్యూటేషన్లు, పివోటి, ఇనాం యాక్ట్‌ల వర్తింపు, భూముల రిజిస్ట్రేషన్‌లో తలెత్తుతున్న సమస్యలు, చట్టపరంగా భూసమస్యల పరిష్కారంలో ఎదురవుతున్న పలు అంశాలను తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులు సూచించిన ప్రతి సమస్యపై కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ సుదీర్ఘంగా చర్చించి పరిష్కారానికి తగు సూచనలు చేశారు. చట్టపరంగా, సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రెవెన్యూసమస్యలను రెవెన్యూ చట్టాలకు లోబడి పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూలో మ్యూటేషన్లు సక్రమంగా జరిగితే 99శాతం రెవెన్యూ సమస్యలు వచ్చే అవకాశం ఉండదన్నారు. తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులందరూ రెవెన్యూ చట్టాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి సమస్యను సక్రమమైన పద్దతిలో పరిష్కరించేందుకు దృష్టిపెట్టాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో చట్టపరంగా ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి గాని, జేసీ దృష్టికి గాని తీసుకురావాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సర్వేల్యాండ్ రికార్డుల ఎడి నాగశేఖర్, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవోలు అనూష, వంశీకృష్ణ, పావని, తహశీల్దార్లు, డిటిలు, ఆర్ఐలు, విఆర్వోలు పాల్గొన్నారు.