నెల్లూరు బ్యారేజ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 09 :
పెన్నా నదిపై నిర్మించిన నెల్లూరు బ్యారేజ్ పరిసర ప్రాంతాలలో సుందరమైన పచ్చదనాన్ని పెంపొందించి, ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకర్షించే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ తెలియజేశారు.పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 52వ డివిజన్ రంగనాయకులపేట రైలు వీధి, పెద్ద తోట, గోపురం వీధి, యాదవ వీధి, ఆనకట్ట వీధి, తిక్కన పార్కు,నెల్లూరు బ్యారేజ్ తదితర ప్రాంతాలలో కమిషనర్ బుధవారం పర్యటించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు బ్యారేజ్ ను సందర్శించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తి చూపుతున్నారని,బ్యారేజ్ పరిసర ప్రాంతాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్ది మౌలిక వసతులను కల్పించనున్నామని వెల్లడించారు.డివిజన్ వ్యాప్తంగా డ్రైను కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులను ప్రణాళిక బద్దంగా నిర్వహించేందుకు పారిశుద్ధ కార్మికులను వీధుల వారీగా కేటాయించి పనులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.అవసరమైన అన్ని ప్రాంతాలలో డ్రైను కాలువల నిర్మాణం ఇతర ఇంజనీరింగ్ వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పెన్నా బ్యారేజ్ సమీపంలోని చారిత్రాత్మకమైన తిక్కన పార్కును అభివృద్ధి పరచి ఆసక్తికరమైన చరిత్ర విషయాలను సందర్శకులు తెలుసుకునేలా ఆధునికరించేలా పనులను పూర్తి చేయనున్నామని తెలిపారు.అనంతరం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ సందర్శించి ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను, క్యాంటిన్ నిర్వాహకుల సేవలను పరిశీలించారు. టోకెన్ విధానం ద్వారా ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించాలని కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు,ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు రహంతూజానీ,ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, రెవిన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా,వార్డు సచివాలయం కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment