ధరల పెంపు పైన సీపీఎం ధర్నా
నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 10 :
పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి అని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు పై కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి అని సిపిఎం ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ నుండి వి ఆర్ సి సెంటర్ వరకు గురువారం ఉదయం నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నిరసన ధర్నా నిర్వహించినది.వంటగ్యాస్ పై పెంచిన 50 రూపాయల పెంపుదలను ప్రభుత్వమే భరించాలని, ఇప్పటికే వివిధ రకాల భారాలతో అల్లాడుతున్న ప్రజలపై అదనపు భారాలు మోపడం తగదని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) నెల్లూరు నగర, రూరల్ కమిటీల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అత్యధిక పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు దేశంలో మరే రాష్ట్రంలో లేవని అన్నారు. మన రాష్ట్రం కన్నా కర్ణాటకలో పది రూపాయలు తక్కువ ఉన్నదని, తమిళనాడులో మన రాష్ట్రం కన్నా 5 రూపాయల తక్కువ, కేరళ తెలంగాణ మొదలగు రాష్ట్రాలలో మన రాష్ట్రం కన్నా తక్కువ ధరలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే కరెంటు చార్జీలలో అదనపు బారాల పేరుతో భారీగా విధిస్తున్నారని,ఇంటి పన్నులు పెంచారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. వచ్చే జీతాలు వేతనాలతో కుటుంబ అవసరాలు తీరక ప్రజలు అల్లాడుతుంటే ఇప్పుడు అదనంగా గ్యాస్ పై 50 రూపాయల పెంచడం సరియైన చర్య కాదని అన్నారు తక్షణమే 50 రూపాయల పెంపుదలను రద్దుచేసి ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఇతర రాష్ట్రాల కన్నా తక్కువగా ఉండే విధంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ విధానాల తీరుమారకపోతే ప్రజా ఉద్యమాలు పోరాటాలు తప్పవని హెచ్చరించారు.అనంతరం సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ బి, రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి నాగేశ్వరరావు, కే పెంచల నరసయ్య, అబ్దుల్ అజీజ్, నాయకులు పి సూర్యనారాయణ, బీపీ నరసింహ,మూలం ప్రసాద్, షేక్ షంషాద్, టి శివకుమారి, కత్తి పద్మ,షేక్ షాహినబేగం, మాలకొండయ్య, షేక్ జాఫర్ చెంగయ్య, షేక్ ఫయాజ్, కే సురేష్, కే.ఏమేలు,చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.