రాష్ట్ర పండుగగా రథసప్తమి

రాష్ట్ర పండుగగా రథసప్తమి

అరసవెల్లి సూర్య దేవాలయం నుంచి శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా పురాతన ఆలయాలకు పూర్వవైభవం

రూ.38 కోట్లతో నెల్లూరు జిల్లాలో 18 ఆలయాల పునర్నిర్మాణానికి చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రికి విస్త్రత ఏర్పాట్లు

మంత్రి నారాయణతో చర్చించి మూలాపేట శివాలయం అభివృద్ధికి చర్యలు

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి




నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 

సమస్త మానవళికి వెలుగులు ప్రసాదించే సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని మూలాపేట శ్రీ మూలస్థానేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించి మహాశివుడిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని సూర్యభగవానుడిని దర్శించుకుని ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అరసవెల్లిలోని ప్రముఖ సూర్య భగవానుడి ఆలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అరసవెల్లిలో ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించాల్సి వుండగా, ఆ ప్రాంతంలో ఎన్నికలకోడ్‌ అమలులో వున్నందున దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రభుత్వ లాంఛనాలతో పట్టువస్త్రాలు సమర్పించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఘనంగా రథసప్తమి పూజాకార్యక్రమాలను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఆలయాలను పూర్తిగా విస్మరించిందని, తమ ప్రభుత్వం ఆలయాల పవిత్రత, సనాతన ధర్మం పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా పురాతన ఆలయాలను ఆగమశాస్త్రం ప్రకారం పున:నిర్మించి పూర్వవైభవానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 

నెల్లూరుజిల్లాలో 18 ప్రసిద్ధ ఆలయాల పున:నిర్మాణానికి రూ.38 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని అన్ని ప్రముఖ శైవక్షేత్రాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్త్రతమైన ఏర్పాట్లు చేపట్టేలా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, శ్రీశైలం, మహానంది, కోటప్పకొండ మొదలైన ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీకనుగుణంగా, భక్తులందరూ సంతృప్తికరంగా మహాదేవుడిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 

నెల్లూరు మూలాపేట శివాలయంతో తమ కుటుంబానికి  ప్రత్యేక అనుబంధం వుందన్న మంత్రి, ప్రతి ఏటా రథసప్తమి పూజలను తమ కుటుంబం ఆధ్వర్యంలో ఉభయదాతలుగా నిర్వహించడం ఆనవాయితీగా  వస్తుందన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణతో కలిసి శివాలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం పురాతన రాతి కట్టడాలకు రంగు వేసి వాటి రూపుకోల్పోయేలా చేసిందని, తమ ప్రభుత్వ హయాంలో అన్ని ఆలయాల్లోని రాతికట్టడాలను యధావిధిగా వుంచేలా, రంగులను తొలగించి పూర్వం ఎలా వున్నాయో అదేవిధంగా నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్‌ తరాలకు మన ఆలయాల విశిష్టత, చరిత్ర తెలిసేలా,వేదాలు, ఆగమ శాస్త్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఆలయాల పూర్వవైభవానికి దృఢ సంకల్పంతో పనిచేస్తుందని మంత్రి చెప్పారు. 

ఆ ఆదిత్యుని దివ్యతేజోవంతమైన వెలుగులతో ప్రతిఒక్కరి జీవితం ఆనందమయం కావాలని, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలందరిపై సూర్యభగవానుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్లు కోవూరు జనార్దన్‌రెడ్డి, జె.శ్రీనివాసరావు, ఈవో అర్వభూమి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget