ఈ నెల 26 న మహా శివరాత్రి పర్వదిన సందర్బంగా నెల్లూరు మూలాపేట లోని భువనేశ్వరి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నెల్లూరు ఆర్ డి ఓ ఎన్ ఎస్ అనూష సంబంధిత అధికారులకు సూచించారు.
మంగళవారం మూలపేట శివాలయ ఆవరణలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఈనెల 21 నుండి మార్చి 5 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి దర్భంగా భక్తులు విశేషంగా హాజరవుతారని అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ వారు శివాలయ పరిసర ప్రాంతాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచి బ్లీచింగ్, మంచినీటి సరఫరా, చలివేంద్రాల ఏర్పాటు, సైడ్ కాలువలను శుభ్రపరచుట తదితర పనులు చేయాలన్నారు. కోనేరు ను శుభ్రపరచడంతో పాటు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ చేయాలని సూచించారు. అదేవిధంగా శానిటేషన్ సిబ్బందిని మూడు షిఫ్టుల్లో ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు బందోబస్తు ఏర్పాటుతోపాటు రథోత్సవం రోజున ప్రత్యేక రోప్ పార్టీని ఏర్పాటు చేయాలని సూచించారు. క్రౌడ్ మేనేజ్మెంట్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే అంతరాయం లేని నిరంతర విద్యుత్ ప్రసారానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా రథోత్సవం జరిగే అన్ని ప్రాంతాల్లో గుంతలు లేకుండా చూడాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ప్రాథమిక చికిత్సకు అవసరమైన అన్ని మందులతో పాటు ఎండలు ఎక్కువగా ఉన్నందున ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డి.ఎస్.పి సింధు ప్రియ దేవాదాయ సహాయ కమిషనర్ జనార్దన్ రెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత, నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఇంకా విద్యుత్, ఆర్ అండ్ బి, ఫైర్ శాఖల అధికారులు పాల్గొన్నారు
Post a Comment