రేపు మాపో కూలేలా ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం
బిక్కు బిక్కు మంటూవిధులు నిర్వహిస్తున్న సిబ్బంది
జలదంకి, మేజర్ న్యూస్ :-
జలదంకి ఎంపీడీవో కార్యాలయానికి సొంత భవనం లేక స్త్రీ శక్తి భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ భవనం గోడలు పిల్లర్స్ కు సంబంధం లేకుండా భూమిలోకి కుంగి రేపో మాపో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది ఏమి చేయలేని పరిస్థితిలో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎంపీడీవో భవనాన్ని నిర్మిస్తున్నామని చెబుతున్నారే తప్ప, ఆచరణకు నోచుకోలేదు. గత ప్రభుత్వంలో జలదంకి లోని ఓ ప్రైవేటు భవనంలో ఎంపీడీవో కార్యాలయం ఉండేది. అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో, స్త్రీ మహిళా భవనంలోకి మార్చారు. భారీ వర్షాలు కురిసినా, తుఫాను ప్రభావమైనా భవనం ఎక్కడ కూలిపోతుందో అని చూసే వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యాలయం లోనే ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం ఉంది. చిన్నపాటి వర్షానికి గోడల పగుళ్లలో నుంచి నీళ్లు కార్యాలయంలోకి చేరుతూ ఉంటాయి. కార్యాలయ సిబ్బంది చేసేదేమీ లేక వర్షం వస్తే ఫైళ్ళు పక్కకి మార్చుకోవడం, బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని నూతన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని నిర్మించాల్సిందిగా మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Post a Comment