బెదిరింపుల ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు నమోదు చేయాలి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్
నెల్లూరులో వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రెస్‌మీట్.
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ పని చేయాలి
25న వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్
నెల్లూరు, మేజర్ న్యూస్ :
ఇసుక, మద్యం విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించను అని చంద్రబాబు తన సొంత పార్టీ నేతలకు జారీ చేస్తున్న హెచ్చరికల్లో నిజంగా చిత్తుశుద్ధి ఉంటే, ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, బ్లాక్‌మెయిల్ చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని నెల్లూరు జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు జిల్లా వైసీపీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇసుక, మద్యం వివాదాల్లో ఉన్న ఎంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు నమోదు చేశారో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరు అన్న కాకాణి.. తమ పార్టీ వారెవ్వరూ ఇసుక, మద్యం జోలికి పోవద్దని చంద్రబాబు చెప్పాడంటే.. ఇష్టారాజ్యంగా దోచుకోమని వారికి చెప్పినట్లే అని స్పష్టం చేశారు.
కూటమి ఈ నాలుగు నెలల పాలనంతా యథేచ్ఛగా దోచుకో తినుకో పంచుకో (డీపీటీ) అని మాజీ మంత్రి ఆక్షేపించారు. ఇసుక, మద్యం పాలసీల్లో అంతా గోల్‌మాల్ అన్న ఆయన, ప్రభుత్వ మాటలకు, చేతులకు ఎక్కడా పొంతన లేదని, ఇసుక మొత్తం దోచుకున్నాక సీనరేజ్ రద్దు అని ప్రకటించారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక ధర వేలల్లో ఉండగా, సీనరేజ్ రద్దుతో కేవలం పదుల్లోనే ఊరట కలుగుతుందని తెలిపారు. ఇసుకలో రూ.800 కోట్ల ఆదాయానికి గండి కొట్టిన కూటమి నేతలు, ఎక్కడికక్కడ యథేచ్చగా దోపిడి చేశారని అన్నారు.
నెల్లూరులోనూ కూటమి నేతల దందా కొనసాగుతోందన్న కాకాణి, స్థానిక సూరాయపాలెం ఇసుక రీచ్‌లో రూ.100 కోట్ల ఇసుక దోపిడీకి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్కెచ్ వేశారని ఆరోపించారు. జిల్లాలోని నాలుగు ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు టన్ను ఇసుకకు రూ.114.90 నిర్ణయిస్తే, రూ.36 కే చేస్తామని టెండర్లు వేయడం వెనుక రీచ్‌లను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు చేసిన కుట్ర కాదా? అని నిలదీశారు. ఇసుక రీచ్‌లకు దాఖలైన టెండర్ల నుంచి లాటరీ ద్వారా కాంట్రాక్ట్ ఖరారు చేయాలన్న నిబంధనను మంత్రి నారాయణ ఒత్తిడి మేరకు కలెక్టర్ బేఖాతర్ చేస్తూ, ఎమ్మెల్యేల అనుచరులకు తిరిగి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై ఈనెల 25న ధర్నా చేస్తున్నట్లు చెప్పారు.
Post a Comment