బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేస్తే జరిమానాలు విధించండి, కమిషనర్ సూర్యతేజ
ములాపేట, మేజర్ న్యూస్
-నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులను మరింత మెరుగ్గా నిర్వహించే క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో పారిశుద్ధ్య విభాగంతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శానిటేషన్ కార్యదర్శులంతా ప్రతిరోజూ ఫీల్డ్ విజిట్ చేయాలని, పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి తెలియజేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రతిరోజూ మొబైల్ ఆధారిత హాజరు వేయించాలని, విధి నిర్వహణలో రక్షణా ఉపకరణాలు తప్పనిసరిగా వినియోగించేలా పర్యవేక్షించాలని సూచించారు.
పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత డివిజన్లలోని కార్యదర్శులు, సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
అన్ని డ్రైను కాలువల్లో పూడికతీత పనులను, సిల్ట్ తొలగింపు పనులను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. పరిసరాల పరిశుభ్రత కోసం నగర పాలక సంస్థలో అందుబాటులో ఉన్న అన్ని వాహనాలు, యంత్రాలకు మరమ్మతులు చేసి పూర్తిస్థాయిలో వినియోగించుకుని చక్కటి ప్రణాళికతో పనులను పూర్తి చేయాలని సూచించారు.
ప్రచార పోస్టర్లు, భవన నిర్మాణ వ్యర్ధాలను రోడ్లపై తొలగించేందుకు అవసరమైన ఇతర విభాగాల కార్యదర్శులను కూడా సమన్వయం చేసుకుంటూ డివిజన్ల వారీగా మార్పు తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు. పరిశుభ్రంగా ఉంచుకోని ఖాళీ ప్లాట్ల యజమానులను గుర్తించి నోటీసులు జారీ చేసి, ప్లాట్లను శుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణకు అధునాతన మానవ రహిత వాహనాలు, యంత్రాలు కూడా నగర పాలక సంస్థలో అందుబాటులో ఉన్నాయని వాటి సేవలను అవసరమైన అన్ని ప్రాంతాల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నియంత్రణకు డ్రైను కాలువల్లో అక్కడక్కడా జల్లెడ ఏర్పాటును చేయాలని, ఏ ప్రాంతాల్లో అలాంటి ఏర్పాట్లు అవసరమున్నాయో వివరాలను తెలియజేయాలని కమిషనర్ కోరారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, డి.ఈ సాయిరాం, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Post a Comment