సమన్వయంతో పనిచేసి వినాయక చవితి నిమజ్జన ఉత్సవాలను విజయవంతం చేయండి
- ఇరుగాళమ్మ గణేష్ ఘాట్, పెన్నానది ఘాట్ వద్ద పక్కాగా ఏర్పాట్లు
- నిమజ్జనం సాగే 8 మార్గాల్లో పటిష్ట బందోబస్తు
- భారీ క్రేన్లను నిమజ్జనానికి అందుబాటులో ఉంచండి
- అధికారులకు దిశానిర్దేశం చేసిన జాయింట్ కలెక్టర్ కార్తీక్
- సెప్టెంబర్ 5వ తేదీలోగా అనుమతులకు దరఖాస్తులు చేసుకోవాలని నిర్వాహకులకు సూచన
నెల్లూరు, ఆగస్టు 28 : వచ్చేనెల 7న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నగరంలో నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ సూచించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాల నిర్వహణపై జేసీ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని ఇరుగాళమ్మ గుడి వద్దనున్న గణేష్ ఘాట్, రంగనాయకులపేట వద్దనున్న పెన్నా ఘాట్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై శాఖల వారీగా జాయింట్ కలెక్టరు సమీక్షించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇరుగాళమ్మ గుడి, పెన్నానది ఘాట్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లను అడిషనల్ కమిషనర్ శర్మద, ఈఈ చంద్రయ్య జేసీకి వివరించారు. ఘాట్ల వద్ద రూ.1.60 కోట్లతో సివిల్ వర్క్స్ చేపడుతున్నట్లు చెప్పారు. రెండు ఘాట్ల వద్ద రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు, తాగునీటి స్టాళ్ల ఏర్పాటు, బారికేడిరగ్, హైడ్రాలిక్ క్రేన్లు, గ్రానైట్ రిపేర్లు, రోడ్ల ప్యాచ్ వర్క్సు, మొబైల్ టాయిలెట్స్, ఎల్‌ఈడి లైటింగ్, ఫ్లడ్ లైట్లు, సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, పెయింటింగ్, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం, సాంస్కృతిక కార్యక్రమాలకు స్టేజి నిర్మాణాలు మొదలైన ఏర్పాట్లను చేపడుతున్నట్లు కార్పొరేషన్ అధికారులు జేసీకి వివరించారు. అలాగే ఇరుగాళమ్మ గణేష్ ఘాట్ ప్రాంతాన్ని 6 జోన్లు, పెన్నా ఘాట్ ప్రాంతాన్ని 5 జోన్లుగా విభజించి మూడుషిప్టుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈఈ చంద్రయ్య చెప్పారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సెప్టెంబర్ నెల 7వ తేదీన వినాయకచవితి పర్వదినం మొదలుకానుందని, తొలిరోజు నుంచే ఘాట్ల వద్ద విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలన్నారు. వినాయక చవితి మొదలైన మొదటి రోజు 7వ తేదీ, మూడో రోజు 9వ తేదీ, ఐదో రోజు 11వ తేదీన సామూహిక నిమజ్జనం చేయడానికి ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు వచ్చే అవకాశం వున్నందున అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎక్కువ కెపాసిటీ గల క్రేన్లను ఘాట్ల వద్ద అందుబాటులో వుంచాలని ఆదేశించారు. విగ్రహాల ఏర్పాటు, విద్యుత్, మైక్ పర్మిషన్లు ఎప్పటిలాగా ముందుగా తీసుకోవాలని,సెప్టెంబర్ 5వ తేదీలోగా అనుమతులకు దరఖాస్తులు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఇరుగాళమ్మ గుడి వద్దనున్న గణేష్ ఘాట్ వద్ద చెరువులో పూడికతీత పనులు పూర్తి చేయాలని, విగ్రహాలు మునిగేందుకు సరిపడ నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. నిమజ్జనానికి విగ్రహాలు తరలించే 8 మార్గల్లో విద్యుత్ తీగలు విగ్రహాలకు అడ్డురాకుండా విద్యుత్‌శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఘాట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను జేసీ ఆదేశించారు. ఘాట్ల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా గజ ఈతగాళ్లను, పడవలను అందుబాటులో ఉంచాలని ఫైర్, మత్స్యశాఖ అధికారులకు సూచించారు. నగరంలో విగ్రహాల నిమజ్జనం సమయంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవాలని ఎఎస్పీలకు సూచించారు. ఘాట్ల వద్ద మెడికల్ క్యాంపులు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని డిఎంఅండ్‌హెచ్‌వోకు సూచించారు. విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల సూచనలను కూడా జేసీ పరిగణలోనికి తీసుకుని, అందుకనుగుణంగా అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఈ సమావేశంలో ఎఎస్పీలు సౌజన్య, శ్రీనివాసరెడ్డి, డిఆర్‌వో లవన్న, అడిషనల్ కమిషనర్ శర్మద, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయన్, డిఎంఅండ్‌హెచ్‌వో పెంచలయ్య, జడ్పీ సిఇవో కన్నమనాయుడు, ఆర్ అండ్ బి ఎస్‌ఈ గంగాధర్, కార్పొరేషన్ ఈఈ చంద్రయ్య, ఆర్డీవో మలోల, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పిట్టి సత్య నాగేశ్వరరావు, సురేంద్రరెడ్డి, ఎవిఆర్ మోహన్‌రావు, శ్రీకాంత్, బయ్యా వాసు తదితరులు పాల్గొన్నారు.
.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, నెల్లూరు వారిచే జారీ
Post a Comment