తెలుగు వ్యవహారిక భాషకు గిడుగు సేవలు మరువలేనివి
- నివాళులర్పించిన కలెక్టర్ ఆనంద్
- ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
నెల్లూరు, ఆగస్టు 28 : తెలుగును వాడుక భాషగా తీసుకురావడానికి గిడుగు వెంకటరామమూర్తి ఎంతో కృషి చేశారని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ అన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లో గిడుగు వెంకటరామమూర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగుభాషకు గిడుగు వెంకటరామమూర్తి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతిని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. గ్రాంధిక భాషలో వున్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకుని భాషను అందరికి సులభతరం చేసిన గొప్ప చరిత్రకారుడు, బహుభాషా శాస్త్రవేత్త గిడుగు వెంకటరామమూర్తి అని కొనియాడారు. గిడుగు భాషోద్యమం వలన ఏ కొందరికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. తెలుగుభాషకు ఎనలేని సేవ చేసిన గిడుగు రామమ్మూర్తి స్ఫూర్తితో ప్రతిఒక్కరూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.
తొలుత గిడుగు చిత్రపటానికి కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డిఆర్‌వో లవన్న తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో
గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవ వేడుకలను జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావు, అధికారులు, సిబ్బంది గిడుగు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని కార్యాలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. సదారావు, జిల్లా రవాణా డిప్యూటీ కమిషనర్ చందర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయ్‌కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, నెల్లూరు వారిచే జారీ
Post a Comment