ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, స్వర్ణాల చెరువు అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభిస్తాం
- తొలి దశలో ప్రాథమిక స్థాయి పనులను పూర్తి చేస్తాం
- అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం
- మంత్రి నారాయణ
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 41వ డివిజన్ నందు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద నిలిచిపోయిన అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో చేపట్టిన పనులు, ప్రస్తుతం చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కమిషనర్ వికాస్, నుడా విసి బాపిరెడ్డి మంత్రికి వివరించారు. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించేందుకు ఏదైనా కెమికల్ ప్రక్రియ ఉందేమోనని తెలుసుకోవాలని, లేకుంటే జెసిబిలతో తొలగించేందుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాలని సూచించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్యలో ప్రారంభించి ఆగిపోయిన పనులను త్వరలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 2014-19లో తమ ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగర అభివృద్ధికి నుడా ఆధ్వర్యంలో 30 కోట్లను మంజూరు చేయగా, 24 కోట్లు ఖర్చు పెట్టి నెల్లూరు నగరంలో పార్కులు, నెక్లెస్ రోడ్డు, స్వర్ణాల చెరువు అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. అనంతరం పనులు నిలిచిపోయాయన్నారు. మళ్లీ నిలిచిపోయిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. 50 కోట్లతో అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ వికాస్ ప్రతిపాదనలు సిద్ధం చేశారని, వీటిపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తొలి దశలో నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గుర్రపు డెక్క, కంప చెట్లను తొలగించడం, వీధిలైట్లు మరమ్మత్తులు, విగ్రహాలకు పెయింటింగ్, మరమ్మత్తులు, పగిలిపోయిన గ్రానైట్ స్థానంలో నూతనంగా గ్రానైట్ ఏర్పాటు మొదలైన ప్రాథమిక పనులను చేపడతామని చెప్పారు. రెండో దశలో స్వర్ణాల చెరువులో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, సుందరీకరణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పకుండా నెరవేరుస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. పై కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నగర మాజీ మేయర్ భాను శ్రీ, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment