అమరావతికి మరో శుభవార్త-దేశంలోనే పురాతన బిజినెస్ స్కూల్ క్యాంపస్ కు రెడీ.
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని ప్రాంతంలో అభివృద్ధితో పాటు కొత్త సంస్థల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో క్యాంపస్ ల ఏర్పాటుకు సిద్దమై భూములు కూడా తీసుకున్న జాతీయ స్థాయి విద్య సంస్థలు ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయినా. ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో తిరిగి అమరావతి బాట పడుతున్నాయి.
ఇందులో భాగంగా దేశంలోనే అత్యంత పురాతన బిజినెస్ స్కూళ్లలో ఒకటైన జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఎక్స్ఎల్ఆర్ఐ) తమ క్యాంపస్ ఏర్పాటుకు తిరిగి సిద్ధమైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.250 కోట్ల బడ్జెట్ తో క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమైనా ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో అంతా తలకిందులైంది. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల్లో తిరిగి జేవియర్ బిజినెస్ స్కూల్ తమ క్యాంపస్ ను అమరావతిలో పెడతామని ముందుకొచ్చింది. ఈ మేరకు సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్ తో చర్చలు జరిపింది.
జేవియర్ బిజినెస్ స్కూల్ అమరావతి క్యాంపస్ ఏర్పాటు అయితే ఇందులో జాతీయ స్దాయిలో అడ్మిషన్లు జరగడంతో పాటు మొత్తం 5 వేల మంది విద్యార్ధులు చదువుకునేందుకు పీజీ, యూజీ కోర్సులు చదువుకునేందుకు వీలుంది. 1949లో స్టీల్ సిటీ జంషెడ్ పూర్ లో ఏర్పాటు అయిన జేవియర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు ఢిల్లీలోని జజ్జార్ లో కూడా క్యాంపస్ ఉంది. జాతీయ స్ధాయిలో ప్రస్తుతం 9వ ర్యాంకులో ఉన్న ఈ ప్రతిష్టాత్మక కాలేజీ అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేస్తే ఇక్కడ బిజినెస్ స్కూల్ లేని కొరత తీరనుంది.
Post a Comment