నూతన ఇసుక విధానం 2024 కార్యక్రమాన్ని ఈ నెల 8 న సోమవారం నుండి అత్యంత పారదర్శకంగా ఇసుక వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
రవి కిరణాలు,తిరుపతి, జూలై06: -
కొత్త ఇసుక విధానం 2024 కార్యక్రమాన్ని ఈ నెల 8 న సోమవారం నుండి ప్రారంభించాలని తద్వారా ప్రజలకు అత్యంత పారదర్శకంగా, నామ మాత్రపు ధర నిర్ణయించి అందుబాటులోకి తేవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించగా తిరుపతి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు సంబంధిత అధికారులతో కలిసి హాజరై సూచిస్తూ వినియోగదారులకు ఇసుకను జిల్లా కమిటీ నిర్దేశిత ధరలకు పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ఈ జూలై నెల 1 నాడు విజయవంతంగా అత్యధిక శత శాతం దగ్గరగా పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్లు అందరినీ అభినందించారు. కొత్త ఇసుక విధానం 2024 ఈ నెల 8 న సోమవారం నుండి ప్రారంభించాలని సూచించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డిస్ట్రిక్ట్ లెవెల్ శ్యాండ్ కమిటీ) ఏర్పాటుతో ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచి జిల్లా కమిటీ నిర్దేశిత నామ మాత్రపు ధరలకు సరఫరా చేసేలా ఉండాలని సూచించారు. జిల్లా యంత్రాంగం గుర్తించిన ఇసుక స్టాక్ పాయింట్లలో రాబోయే మూడు నెలలకు అవసరమయ్యే ఇసుక స్టాక్ డంప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచి సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణం, సుప్రీం కోర్టు జడ్జిమెంట్, ఎన్జీటి ఉత్తర్వుల మేరకు మాత్రమే చర్యలు ఉండాలని సూచించారు. స్టాక్ పాయింట్ నిర్వహణలో అక్రమ రవాణాకు తావు లేకుండా అప్రమత్తంగా ఉంటూ జిల్లా కలెక్టర్లు వారి జిల్లా గనుల శాఖ అధికారి కి పక్కాగా సూచనలు ఇచ్చి జిల్లా స్థాయి ఇసుక కమిటీ లోని ఎస్పీ, సెబ్ తదితర అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఎప్పటికప్పుడు చెకింగ్, పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇసుక వినియోగదారులకు గనుల శాఖ వెబ్సైట్ నందు స్టాక్ యార్డ్ నందు ఇసుక అందుబాటుపై చెక్ చేసుకున్న అనంతరం వారు స్వంతంగా వాహనాన్ని తీసుకుని స్టాక్ పాయింట్ కు వెళ్లి కలెక్టర్ అధ్యక్షతన డిఎల్ఏసి నిర్దేశించిన రేట్ మేరకు స్టాక్ పాయింట్, ర్యాంప్ తదితర నిర్వహణ చార్జీలకు సంబంధించిన నామ మాత్రపు నిర్దేశిత ధరను డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, సదరు స్టాక్ పాయింట్ ఇంఛార్జి వి ఆర్ ఓ / విఆర్ఎ రసీదు ఇస్తూ ముందు వచ్చిన వారికి ముందుగా అనే విధంగా ఇసుకను సదరు వినియోగదారుడు తెచ్చుకున్న వాహనం నందు ఇసుకను లోడ్ చేయించాల్సి ఉంటుందని, దానికి అనుగుణంగా పర్మిట్ మాన్యువల్ గా ఇచ్చిన మేరకు ఇసుకను సదరు వినియోగదారుడు ఉద్దేశించిన పనికి వినియోగించాలని, బ్లాక్ మార్కెట్ నకు ఇసుక తరలించకుండా జిల్లా కలెక్టర్లు తగిన మెకానిజం ఏర్పాటు చేయాలని సూచించారు.
సిఎస్ విసి అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఏర్పాటుతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇసుక ధర నిర్ధారించడం జరిగిందనీ తెలిపారు. కన్వీనర్ జిల్లా గనుల శాఖ అధికారి ఇందుకు సంబంధించి పలు అంశాలు వివరించారు. కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో నాలుగు స్టాక్ పాయింట్లు ఉన్నాయని అందులో శ్రీకాళహస్తి డివిజన్ నందు సుబ్బరాయుడు కండ్రిగ నందు రెండు స్టాక్ పాయింట్ల వద్ద ఒక మెట్రిక్ టన్నుకు రూ. 200 గా నిర్ధారించడం జరిగిందనీ, పిచ్చాటురు మండలం నందు ఏ కే బీడు నందు రూ. 200 మెట్రిక్ టన్నుగా, సూళ్లూరుపేట డివిజన్ దొరవారి సత్రం మండలము మామిల్ల పాడు వద్ద మెట్రిక్ టన్ను ధర రూ.465, గూడూరు డివిజన్ వెంకటగిరి మండలము మొదలగుంట స్టాక్ పాయింట్ వద్ద ధర రూ. 590 మెట్రిక్ టన్నుకు, ఒక మనిషికి ఒక రోజుకి ఆధార్ కార్డు మేరకు 20 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇవ్వబడుతుందని, ఉదయం 6 నుండి సాయంత్రం 6 గం.ల వరకు మాత్రమే ఇసుక ఇవ్వాల్సి ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో యంత్రాలు వాడరాదని తెలిపారు. రాత్రి పోలీస్, రెవెన్యూ అధికారులు స్టాక్ పాయింట్ల వద్ద విధులు నిర్వర్తించాలని, ఎంట్రీ, ఎక్జిట్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు ఉండాలని తెలిపారు. పంచాయితీ పరిధిలో స్ట్రీమ్స్ నందు ఇసుక తీత, లోడింగ్ వంటి వాటిలో ఎటువంటి యంత్రాలు వాడకుండా గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ఇసుకను వినియోగించు కోవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, అదనపు ఎస్పీ వెంకట్రావు, సెబ్ అదనపు ఎస్పీ రాజేంద్ర, జిల్లా గనుల శాఖ అధికారి ప్రకాష్ కుమార్, ఈఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అశోక్ కుమార్, ఇంఛార్జి డిపిఓ సుశీల దేవి, డిప్యూటీ సిఈఓ ఆదిశేషరెడ్డి, ఎస్ ఈ ఇరిగేషన్ విజయ్ కుమార్, జిల్లా రవాణా అధికారి ఆదినారాయణ, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ విజయ కుమార్ పాల్గొన్నారు.
Post a Comment