మా విజయం కార్యకర్తలకు, ప్రజలకు అంకితం - వి.పి.ఆర్
టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి ఫలితంగానే తాము ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలవగలిగామని వేమిరెడ్డి దంపతులు అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో ప్రజా ప్రతినిధులైన తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. కనుపర్తిపాడు సమీపంలోని వి.పి.ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కోవూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల రాకతో విపిఆర్ కన్వెన్షన్ హాల్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. వేలాదిగా తరలివచ్చిన కేడర్.. జై విపిఆర్ అంటూ నినదించారు. శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు. అనంతరం వేదికపైకి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు నాయకులు, కార్యకర్తలు అపూర్వస్వాగతం పలికారు. వేదికపై టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, జనసేన కోవూరు ఇంచార్జ్ హరిరెడ్డి ఇతర ముఖ్య నాయకులు ఆశీనులయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రసంగించేందుకు మైక్ అందుకోగానే విపిఅర్ జిందాబాద్ అన్న నినాదాలతో విపిఆర్ కన్వెన్షన్ హాల్ ప్రతిధ్వనించింది. కార్యకర్తల ఉత్సాహంతో ఉద్వేగానికి లోనైన ఎంపీ వేమిరెడ్డి గారు తాను మీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంతగా అభిమానించి కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డిని, ఎంపీగా తనను భారీ మెజారిటీతో గెలిపించిన వారి రుణం తప్పకుండా తీర్చుకుంటామన్నారు. అబద్ధాలు చెప్పడం తనకు రాదని, తనకు తెలిసిందల్లా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమేనన్నారు. ఎన్నికల సందర్భంగా తాను చేసిన వాగ్దానాలు ఎలా నెరవేర్చాలా అని నిరంతరం ఆలోచిస్తున్నట్టు తెలిపారు. నెల్లూరు జిల్లాకు కార్య దక్షత కలిగిన వ్యక్తులుకు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు కట్టబెట్టడం నెల్లూరు జిల్లావాసులు చేసుకున్న అదృష్టంగా వేమిరెడ్డి గారు అభివర్ణించారు.
అపార అనుభవమున్న జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ,మ ఆనం రామనారాయణ రెడ్డి గార్లని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కొనియాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇఫ్కో కిసాన్ సెజ్కేం, కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన మిథాని ప్రాజెక్టులు సాధించి కోవూరు యువతకు ఉపాధి అవకాశాల కల్పిస్తామన్నారు. వయసులో చిన్నవారైనా పోలంరెడ్డి దినేష్ రెడ్డి పరిణతి చెందిన నాయకుడని, దినేష్ రెడ్డి తనకు బిడ్డ లాంటోడని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నో ఒత్తిళ్ళు, అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా వెన్ను చూపి పారిపోకుండా తన వెన్నంటి ఉండి తనను అఖండ మెజారిటీతో గెలిపించిన ఎన్డీఏ కార్యకర్తలు, కోవూరు ప్రజానీకానికి తన విజయం అంకితం చేస్తున్నానన్నారు. విపిఆర్ గారి ప్రోత్సాహం, కార్యకర్తల కృషి ఫలితంతోనే తాను ఎమ్మెల్యేగా మీ ముందు నిలుచున్నానని అన్నారు. ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మండే ఎండల్లో కార్యకర్తలు పడ్డ కష్టం తనకు తెలుసని, తన విజయం కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే సోదరులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి సహకారం మాటల్లో చెప్పలేనన్నారు.
అనంతరం టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, జనసేన కోవూరు ఇంచార్జ్ హరిరెడ్డి తదితరులు మాట్లాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయని, వార్ వన్ సైడ్ అన్నట్టు గతమెన్నడూ లేనివిధంగా టిడిపి పదికి పది స్థానాలు సాధించిందని కొనియాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులుగా కేంద్రంలో ఉన్న పరిచయాలకు తోడు ఎన్‌డీఏ ప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా ఉన్నందున ఇటు కోవూరు నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యేగా గెలవడం ఒక ఎత్తైతే యాభై వేల పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించడం సరికొత్త రికార్డని నేతలు ప్రశంసలతో ముంచెత్తారు.
Post a Comment