ఎస్ కె ఎల్ ఎస్ బంకులో నీళ్ల పెట్రోల్ విక్రయం.
రవి కిరణాలు, తిరుపతి జిల్లా నాయుడుపేట:-
నాయుడుపేట పట్టణ సమీపంలోని మల్లాం జంక్షన్ వద్ద ఉన్న ఎస్ కె ఎల్ ఎస్ పెట్రోల్ బంకులో నీళ్లు కలిపిన పెట్రోల్ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.గతంలో ఇదే పెట్రోల్ బంకులో అనేక పర్యాయాలు పెట్రోల్ లో నీళ్లు కలిపి విక్రయించడంతో వాహన చోధకులు పెట్రోల్ బంకు నిర్వాహకులతో వివాదానికి దిగి నిరసన తెలియజేసిన సంఘటన అనేకం ఉన్నాయి.సంబంధిత అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప పెట్రోల్ కల్తీ నివారించలేకపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సోమవారం నాయుడుపేట మున్సిపాలిటీలోని మునిరత్నం నగర్ కు చెందిన అల్లాకుల రాజేష్ తన మోటార్ బైక్ లో ఎస్ కే ఎల్ ఎస్ పెట్రోల్ బంకు లో 110 రూపాయలకు పెట్రోల్ నింపుకొని పట్టణానికి వస్తుండగా మార్గ మధ్యలో నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా బండి స్టార్ట్ కాకపోవడంతో అనుమానం వచ్చి పెట్రోల్ ను సీసాల్లోకి నింపడంతో సగం నీళ్లు కలిపి ఉన్నట్లు గమనించారు.నీళ్లు కల్తీ జరిగిన పెట్రోల్ తీసుకుని ఎస్ కే ఎల్ ఎస్ పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి నిర్వాహకులను ప్రశ్నించగా వారికి చేదు అనుభవం ఎదురయింది. దీనితో రాజేష్ చేసేదేమీ లేక నీళ్లు కల్తీ చేసి పెట్రోల్ విక్రయిస్తున్న విషయాన్ని స్థానిక విలేకరులకు తెలియజేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పెట్రోల్ కల్తీకి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు.
Post a Comment